గన్నవరం టికెట్‌ యార్లగడ్డకే… కన్ఫామ్!

Yarlagadda Venkat Raoఈ నెల 18న యార్లగడ్డ వెంకటరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. 20న హైదరాబాద్‌ వెళ్ళి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు. 21న నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరారు. 22న గన్నవరం సభలో పాల్గొన్నారు. 23న గన్నవరం టిడిపి అభ్యర్ధిగా ఎంపికయ్యారు.

ADVERTISEMENT

యార్లగడ్డ వెంకటరావుని గన్నవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు నారా లోకేష్‌ స్వయంగా కొద్దిసేపటి క్రితం గన్నవరంలో ప్రకటించారు. ఏపీ టిడిపి అధ్యక్షుడు హోదాలో కింజారపు అచ్చెన్నాయుడు కొద్ది సేపటి క్రితమే ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ ట్విట్టర్‌లో నియామక పత్రాన్ని విడుదల చేశారు.

గత ఎన్నికలలో వల్లభనేని వంశీ చేతిలోనే యార్లగడ్డ వెంకటరావు ఓడిపోయారు. వంశీ కారణంగానే ఈసారి వైసీపీలో టికెట్‌ దక్కలేదు. వంశీ కారణంగానే పార్టీ నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. కనుక వచ్చే ఎన్నికలలో వంశీని ఓడించాలని యార్లగడ్డ చాలా పట్టుదలగా ఉన్నారని టిడిపి బాగానే గ్రహించింది. యార్లగడ్డకు అంగబలం, అర్దబలం రెండూ పుష్కలంగా ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంపై మంచి పట్టు కూడా ఉంది. కనుక వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని టిడిపి ఆయనకు టికెట్‌ ఖరారు చేసిందని భావించవచ్చు.

ఇక యార్లగడ్డ విషయానికి వస్తే, ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని వైసీపీ నుంచి బయటకు రావడం కలిసి వచ్చిందని చెపొచ్చు. అదే… ఆయన మరికొన్ని నెలలు వైసీపీలోనే ఉంటూ గన్నవరం టికెట్‌ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ కాలక్షేపం చేసి ఉంటే, ఆలోగా టిడిపి మరొకరికి గన్నవరం టికెట్‌ కేటాయించేసి ఉండేది. కానీ నారా లోకేష్‌ గన్నవరం చేరుకొనే సమయానికి వైసీపీ నుంచి బయటకువచ్చేయడం సరైన నిర్ణయమే అని రుజువైంది.

టిడిపి నుంచి గన్నవరం టికెట్‌ సంపాదించుకోవడంతో ఇప్పుడు ఆయన వెనుక కొండంత అండగా టిడిపి కూడా ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీని, కొడాలి నానిని ఓడించాలని టిడిపిలో అందరూ చాలా పట్టుదలగా ఉండటం కూడా యార్లగడ్డ వెంకటరావుకు బాగా కలిసి వస్తుంది. గన్నవరంలో ఈ రాజకీయ పరిణామాలు వల్లభనేని వంశీకి టైమ్ దగ్గర పడిందని సూచిస్తున్నట్లే ఉన్నాయి.
Gannavaram TDP Ticket Confirmed To Yarlagadda Venkata Rao

ADVERTISEMENT
Latest Stories