ఇండస్ట్రీలో మేమంతా ఒకటేనని హీరోలు ఎన్నిసార్లు చెప్పినా అభిమానులు దాన్ని పాజిటివ్ గా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఒకప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని పోస్టర్లకు పేడ కొట్టడంతో మొదలుపెట్టి ఇప్పుడు పైసా లేకపోయినా ట్విట్టర్ అకౌంట్ ఉంటే చాలు ఈజీగా బురద జల్లేయొచ్చు. స్టార్లు వీటిని పెద్దగా పట్టించుకోరు. కలుసుకున్నప్పుడు కౌగలించుకుని ఫోటోలకు ఫోజులిచ్చేస్తారు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఈ విషయం గురించి చాలా ఓపెన్ గా మాట్లాడినా ఫ్యాన్స్ ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు కదా పైపెచ్చు ఇంకా ఎక్కువయ్యింది. అభిమానుల మధ్య పర్సనల్ గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు
ఇప్పుడిది మెల్లగా దర్శకులకు చుట్టుకుంటోంది. ఫలానా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎలివేషన్లు ఇచ్చేలా ట్వీట్లు వేయడం ఇంటర్వ్యూలు ఇవ్వడం సహజం.అది అందరూ చేసేదే. తప్పేం లేదు. ముఖ్యంగా బాలకృష్ణతో చేస్తున్నప్పుడు ఆయన చిత్రాల్లో టైటిల్ సాంగ్స్ లేదా యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మాములుగా ఉండవు. వాటిని ఎగ్జైట్ అయ్యేలా ప్రమోట్ చేసుకుంటేనే రీచ్ బాగా వచ్చి దాని ప్రభావం కలెక్షన్ల మీద ఉంటుంది. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా కావాలని అవతల వాళ్ళను గేలి చేయడం లాంటివి ఉండవు. గోపీచంద్ మలినేనినే తీసుకుంటే గతంలో మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో విన్నర్ చేశాడు. రవితేజకు మూడు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు.
ఇప్పుడు బాలయ్యతో చేసే ఛాన్స్ వచ్చింది. ఆయనేదో తన మానాన తాను జైబాలయ్య పాటలో ఓ లైన్ ని తీసుకుని ట్వీట్ చేస్తే అదేదో వేరే హీరోని తక్కువ చేసినట్టు ఫీలైన కొందరు ఫ్యాన్స్ కింద ఇక్కడ ప్రస్తావించలేని మాటలతో దాడి చేయడం గమనార్హం. అసలు కలిసి సినిమా చేసే ఛాన్సే లేదని భావించిన నందమూరి కొణిదెల కాంబినేషన్ ఆర్ఆర్ఆర్ లో సాధ్యమైనప్పుడు ఇంకా వేర్వేరుగా అభిమానులు భావించడం ట్రాజెడీ. ఏ దర్శకుడైనా నటుడైనా అందరితో సినిమాలు చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు తప్ప ఒక కాంపౌండ్ కే పరిమితం కావాలని కోరుకోడు. అలా చేయడం వల్ల కలిగే లాభం కన్నా జరిగే నష్టం ఎన్నో రెట్లు ఎక్కువ.
ఇలాంటి విపరీత ప్రవర్తన వల్ల ఫ్యాన్స్ వాళ్లలో వాళ్ళు గొడవపడి పరుషమైన పదాలతో దర్శకులను నిర్మాతలను బాధ పెట్టడం తప్ప ఏమి రాదని గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పుడు గోపీచంద్ మలినేని బాలయ్య తో చేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరితో తీస్తాడో ఇంకా తెలియదు. ఈలోగా నీకు వేరే వాళ్లతో సినిమా తీయాలని లేదా అనే బెదిరింపు ధోరణి సరికాదు. చిరంజీవి బాలకృష్ణలు కావొచ్చు వెంకటేష్ నాగార్జునలు కావొచ్చు కలిసి నటించకపోయినా కలుసుకున్నప్పుడు మాత్రం స్నేహభావంతో ఉండటం దశాబ్దాలుగా చూస్తున్నాం. ఇన్ని తెలిసి కూడా చేతిలో ట్విట్టరో ఉందని ఇలా టార్గెట్ చేయడం ఎంతవరకు సబబో ఎవరికి వారే ఆలోచించుకోవాలి!



