
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో సహా అవినీతికి పాల్పడిన ప్రతీ ఒక్కరిపై విచారణ జరిపించి జైలుకి పంపిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పదేపదే హెచ్చరించారు.
ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకొన్న సొమ్ముని కక్కిస్తానని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బారేజ్‌లో కొంతభాగం కుంగిపోవడంతో, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బలం చేకూరిన్నట్లయింది.
విద్యుత్, పౌరసరఫరా శాఖలు వేలకోట్లు అప్పులు చేసిన్నట్లు సమీక్షా సమావేశాలలో అధికారులు సిఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. అన్ని శాఖలలో లెక్కలు తీయిస్తున్నామని, త్వరలోనే వాటినీ బయటపెడతామని మంత్రి సీతక్క నిన్ననే చెప్పారు.
అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కుదురుకొన్న తర్వాత కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ ముఖ్య నేతలందరిపై కేసులు నమోదు చేయించి విచారణ మొదలుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
కేవలం 64 సీట్లతో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొంటూ 5 ఏళ్ళపాటు సుస్తిరంగా సాగేందుకు మరో 10-15 మంది ఎమ్మెల్యేలు చాలా అవసరం. ఆ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు! కనుక వారిని కాంగ్రెస్‌లోకి ఆకర్షించేందుకైనా వారిపై ఈ అవినీతి కేసులతో ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ప్రయత్నించవచ్చు.
ఈ విషయం మాజీ మంత్రి హరీష్ రావు అప్పుడే పసిగట్టిన్నట్లున్నారు. అందుకే నిన్న నర్సాపూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, “మనం పదేళ్ళు నిజాయితీగా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాము. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించవచ్చు. కనుక కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు. అందరం కలిసికట్టుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉందాము,” అని చెప్పారు.
అంటే ఈ కేసులు, అరెస్టులకు బిఆర్ఎస్ నేతలు మానసికంగా సిద్దం అవుతున్నారన్న మాట! ఒకవేళ మొదలైతే వాటిని రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే చూపాలని సూచిస్తున్నారన్న మాట!
కానీ కాంగ్రెస్ ఒత్తిళ్ళు తట్టుకొంటూ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారా?ఉండకపోతే బిఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ ఒత్తిళ్ళ నుంచి రక్షణ పొందేందుకు కేసీఆర్ మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీతో చేతులు కలిపేందుకు, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి సహకరించేందుకు సిద్దపడతారా?ఒకవేళ కేసీఆర్ సిద్దపడినా ప్రధాని నరేంద్రమోడీ అంగీకరిస్తారా?అంగీకరించకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…