హరీష్… ఉంచితే ఏంటి… తీస్తే ఏంటి..!

Harish Shankar - Duvvada Jagannadham Controversy“దువ్వాడ జగన్నాధమ్” సినిమాలో ‘అస్మైక యోగ తస్మైక భోగ’ అనే పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఆల్బమ్ లో హైలైట్ గా నిలిచిన ఈ పాటలో శివుడ్ని కొలిచే ‘నమక, చమకాల’ పదాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం… దానికి హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవడం… ఫైనల్ గా బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు తెలిపిన వ్యాఖ్యలను తీసివేస్తానని హామీ ఇవ్వడం జరిగిపోయాయి.

దీంతో శాంతించిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు “డీజే” ఆడియో వేడుకకు కూడా విచ్చేసి, తగిన రీతిలో గౌరవ మర్యాదలు అందుకున్నారు. ఇంతకీ… జరిగిందేమిటంటే… బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన పదాలను తొలగించకుండానే పాటను విడుదల చేయడంతో… మళ్ళీ వారంతా హరీష్ పై నిప్పులు చెరుగుతున్నారు. మమ్మల్ని హరీష్ శంకర్ ఇంత మోసం చేస్తాడా… అంటూ బ్రాహ్మ‌ణ సంఘాల స‌భ్యులు వెంక‌ట ర‌మ‌ణ శ‌ర్మ‌, గోగులపాటి కృష్ణ మోహ‌న్ ఫైర్ అయ్యారు.

ADVERTISEMENT

ఇచ్చిన మాటను విస్మరించి అదే పాటను వినిపించడమే కాకుండా, సినిమాలోనూ చూపించడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ… ఇప్పటికే సెన్సార్ బోర్డును సంప్రదించామని, వారు సరిగా స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నామని ‘దువ్వాడ’ చిత్ర యూనిట్ ను హెచ్చరించారు. ఇటువంటి చర్య‌ల‌ను తాము చూస్తూ ఊరుకోబోమ‌ని, అన్ని సంఘాల మ‌ద్ద‌తు కూడ‌గట్టి పోరాడ‌తామ‌ని, ఇది కేవ‌లం బ్రాహ్మ‌ణుల‌కు సంబంధించిన అంశమే కాద‌ని, హిందూ మ‌తానికి సంబంధించింద‌ని అన్నారు.

ఈ బ్రాహ్మ‌ణులు ఏం చేస్తారులే అని హ‌రీశ్ శంక‌ర్ అనుకుంటున్నార‌ని, తామేంటో చూపిస్తామ‌ని, త‌న పైత్యం వ‌ల్లే పాటలు రాయించుకున్నానని హరీష్ స్పష్టం చేయడంతో, ఆ పాట‌పై పూర్తి బాధ్య‌త త‌న‌దేన‌ని, ఆ ప‌దాల‌ను తొల‌గిస్తామ‌ని చెప్పి, ఇంత మోసం చేసి హిందూ మ‌తాన్ని అవ‌హేళ‌న చేస్తారా… అంటూ మండిప‌డ్డారు. ఈ విషయంపై బ్రాహ్మణా సంఘాల ప్రతినిధులంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ ను క‌లిసి ఫిర్యాదు కూడా చేశారు.

అయితే ముందుగా తొలగిస్తానని హామీ ఇచ్చిన తర్వాత, ఎందుకు తొలగించలేదో హరీష్ కే తెలియాలి. అది సమయాభావ ప్రభావమో లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా… అన్న విషయం చెప్పినట్లయితే విషయం ఇక్కడవరకు దాకా వచ్చేది కాదేమో! అయినా ఆ పదాలు తొలగించినా… లేకున్నా… సినిమాకు వచ్చే పెద్ద నష్టమేమీ ఉండదు. అయినప్పటికీ ఎందుకు ఇంత మంకుపట్టును హరీష్ ప్రదర్శిస్తున్నారో మరి! రాంగోపాల్ వర్మ శిష్యుడిగా ‘ఫ్రీ పబ్లిసిటీ’లో భాగంగా చేస్తోన్న ‘ట్రిక్’ కాదు కదా..!

ADVERTISEMENT
Latest Stories