సినీ సెలబ్రిటీల గౌరవాన్ని తగ్గించిన ముఖ్యమంత్రిగా ఖ్యాతినందుకున్న జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి వెలుగెత్తిన మొట్టమొదటి హీరో నాని. తన సినిమా రిలీజ్ కు కొద్దిరోజుల సమయం ఉందనగా, టికెట్ల రేట్లపై తన అసంతృప్తిని వ్యక్తపరిచి సంచలనం రేపిన నాని, ఆ తర్వాత అదే ఒరవడిని కొనసాగిస్తూ వచ్చారు.
స్పష్టంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనం జరిగినా, అందుకు సమయస్ఫూర్తిగా స్పందించే తొలివ్యక్తిగా నాచురల్ స్టార్ కీర్తినందుకున్నారు. ఒక రాజకీయ పార్టీని మోయడం గానీ, మరొక పార్టీని విమర్శించడం గానీ చేయకుండా సమస్యపై మాత్రమే స్పందించే హీరో ఎవరు అంటే, నానియే మొదటి పేరు వస్తుంది.
ఇటీవల సమంత విషయంలో కొండా సురేఖ స్పందించిన వైనంపై కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా తన భావాలను, అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా స్పష్టంగా వ్యక్తపరిచిన హీరో నాని. తాజాగా ‘వీకెండ్ వినోదం’గా మారిన అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలోనూ నాని వెంటనే స్పందించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
నాని విషయంలో మెచ్చుకోదగిన మరొక విషయం ఏమిటంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రశ్నించడంతో నాని ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. నాడు ‘హిట్లర్’గా ఎగసిపడిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయినా, నేడు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా సమస్యపై ప్రతిస్పందించడం ప్రశంసించదగ్గ అంశం.
అందుకే సోషల్ మీడియా అంతా నానిని ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అంటూ కొనియాడుతోంది. నిజానికి ఆ టాగ్ లైన్ కి నాని అర్హుడు కూడా! అయితే ఇలా స్పందించే వారిపై అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరించకుండా ఉంటే చాలు!




