అంగరంగ వైభవంగా ఐపీఎల్ 2023 మొదలైపోయింది. మాములుగానే మన దేశంలో విపరీతమైన క్రికెట్ పిచ్చి. ఇప్పుడు కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది కానీ మ్యాచ్ ఫిక్సింగ్ భాగోతాలు జరగకముందు టెస్టులకు సైతం విపరీతమైన ఆదరణ ఉండే రోజుల్లో ఆఫీసులకు కేవలం వీటిని చూడటం కోసమే సెలవులు పెట్టే జనాలు లక్షల్లో ఉండేవాళ్ళు. రోడ్ల మీద నిలబడి టీవీ షోరూమ్ బయట గుడ్లప్పగించి స్కోర్ లు రీప్లేలు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఐపీఎల్ వచ్చాక లెక్క ట్రెండ్ రెండూ మారాయి. హైబ్రిడ్ క్రికెట్ మన ఇళ్లలోకి దూసుకువచ్చింది.
రాష్ట్రాల మధ్య పోటీలు పెడుతూ అన్ని దేశాల నుంచి విదేశీ క్రీడాకారులను వేలంలో కొనుక్కుని కార్పొరేట్ సంస్థలు చేసే వ్యాపారం వందల కోట్ల నుంచి వేలు లక్షల కోట్ల దాకా అలా పాకిపోయింది. బెట్టింగ్ సంగతి సరేసరి. ఫుల్ మ్యాచ్ తో మొదలుపెట్టి ఒక్కో ఓవర్ ఒక్కో బాలుకి డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టుకునే బాపతు మన చుట్టే ఉంటారు. వీళ్ళలో ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయినవాళ్లు, బిచ్చగాళ్ళుగా మారినవాళ్ళూ ఉన్నారు. అయితే ఇంత ఆదరణ ఉన్న ఐపీఎల్ సినిమా పరిశ్రమ మీద చూపించే ప్రభావం ఎంత.
ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఔననే చెప్పాలి. ఎందుకంటే ఫోర్ సిక్సర్లతో మన అభిమాన క్రికెటర్లు గ్రౌండ్ లో విశ్వరూపం చూపిస్తుంటే అదే పనిగా థియేటర్ దాకా వెళ్లి సినిమాలు చూసేంత ఆసక్తి అధిక శాతం మందిలో తగ్గిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు టీమ్స్ ఆడినప్పుడు మాములు రచ్చ ఉండదు. ముంబై ఢిల్లీ జట్లకు సైతం తెలుగు రాష్ట్రాల్లో వీర ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఈసారి జియో సినిమా యాప్ లో కనివిని ఎరుగని ఆప్షన్లతో లైవ్ స్ట్రీమింగ్ ఉచితంగా పైసా తీసుకోకుండా ఇస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద దసరా దూసుకుపోతోంది. గత వారం వచ్చిన దాస్ కా ధమ్కీ ఇప్పటికే నెమ్మదించగా రంగమార్తాండ ప్యాకప్ చెప్పేసుకుంది. హిందీ భోళాకు ఓ మోస్తరు మంచి రిపోర్ట్సే ఉన్నాయి. ఇవన్నీ ఐపీఎల్ వల్ల ఎంతో కొంత కలెక్షన్ ఖచ్చితంగా నష్టపోవాల్సి ఉంటుంది. వచ్చే వారం మీటర్, రావణాసుర ఆపై శాకుంతలం, రుద్రుడు, బిచ్చగాడు 2 ఉన్నాయి.నెల రోజులకు పైగా జరిగే ఐపీఎల్ తాకిడిని తట్టుకోవాలంటే దసరా రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాల్సిందే. లేదంటే దెబ్బ తప్పేలా లేదు.



