ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల జాబితాకు సంబంధించి ఓ నివేదిక వెల్లడయ్యింది. వెల్త్ నివేదిక – 2016లో పేర్కొన్న ప్రకారం మన దేశ ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని ఢిల్లీ నగరాలు మొదటి, రెండవ స్థానాల్లో నిలిచాయి.
తాజాగా విడుదలైన ఈ నివేదిక ప్రకారం, గత పదిహేనేళ్లలో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో సంపన్నుల సంఖ్య 300 శాతానికి పెరిగిపోయింది. 41,200 మంది సంపన్నులతో ముంబయి నగరం ఆసియా, పసిఫిక్ దేశాల్లో 12వ స్థానంలో నిలువగా, 20,600 మంది సంపన్నులతో ఢిల్లీ 20వ స్థానంలో నిలిచింది.
కాగా, మొదటి స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. 2.64 లక్షల మంది మిలియనీర్లు టోక్యోలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేపాటికి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 510 మంది మిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. దీంతో అభివృద్ధి విషయంలో హైదరాబాద్ ఎంత ముందు వరుసలో ఉందో అందరికీ మరోసారి స్పష్టమైంది.





