హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ కు భయపడి.., తమ గమ్యస్థానాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలని భావిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కుతున్న వారు… చివరికి వారి గమ్యస్థానానికి చేరతారో లేదోనన్న భయం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డులో నానాటికి ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీ, ఉన్నత హోదాలలో ఉన్న కుటుంబ సభ్యుల మరణాలకు సాక్ష్యంగా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డులోకి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది.
అయితే తాజాగా జరిగిన ఘటనలో ఏకంగా పోలీసు వాహనమే చితికిపోయింది. భారీ లోడ్ తో వెళ్తున్న లారీ ఎదురుగా ఉన్న పోలీస్ వాహనాన్ని అత్యంత వేగంతో డీ కొట్టడంతో, పోలీస్ వ్యాన్ లో ఉన్న కానిస్టేబుళ్లు వేణు గోపాల్, నాగేశ్వర్, శేఖర్ లు తీవ్ర గాయాల పాలయ్యారు. వేకువజామున జరిగిన ఈ ఘటన సమాచారమందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అంబర్ పేట పరిసర ప్రాంతాల్లో విధి నిర్వహణ చేస్తున్న సందర్భంలో లారీ సదరు పోలీస్ వాహనాన్ని డీ కొట్టినట్లుగా తెలుస్తోంది.
సెలబ్రిటీలు, సామాన్యులే కాక ఏకంగా పోలీసు వాహనాలు కూడా యాక్సిడెంట్ లకు గురవుతుండడంతో ‘డెత్ రోడ్’గా భావిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డులో విధులు నిర్వహించాలంటే పోలీసులు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్లలో సాధారణంగా వాహనాలు అత్యంత వేగంతో ప్రయాణించడం సహజమే. అయినప్పటికీ ఏ ఇతర రోడ్లలో సంభవించని ప్రమాదాలకు ‘హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు’ నిలయంగా మారడం గమనించదగ్గ విషయం.





