గత అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యల పర్యవసానం ఏమైందో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిపై నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలకు గానూ ఒక ఏడాది పాటు అసెంబ్లీ ప్రాంగణానికి రాకుండా నిషేధం విధించడంతో ప్రతిపక్ష పార్టీ వర్గీయులు అవాక్కయ్యారు. ఈ పర్యవసానాలను సరిగా బేరీజు వేసుకోలేకపోయిన జగన్ వ్యూహంలో దెబ్బతిన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అప్పుడు రోజాను వరించిన నిషేధం తాజాగా జగన్ కు కూడా తాకనుందా? ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయం తీసుకుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చు అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి ఈ దిశగా చంద్రబాబు నాయుడును లేఖ రూపంలో కోరారు.
జగన్ జిల్లా (కడప) వాసి అయిన లింగారెడ్డి… “స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపక్ష నేత చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ జగన్ ను మిగిలిన మూడున్నర్రేళ్ళ పాటు శాసనసభ నుండి బహిష్కరించాలని, దీనిపై శాసనసభలో తీర్మానం చేయాలని కోరుతూ” సిఎం చంద్రబాబుకు లేఖ రాసారు. మరి ఇది లింగారెడ్డి సొంత నిర్ణయమో లేక పార్టీ వర్గాలు అంతర్గతంగా తీసుకున్న నిర్ణయమో గానీ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. జగన్ అందుకు అర్హుడే అంటారా!?





