శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ 20 సిరీస్ లో భాగంగా రెండవ మ్యాచ్ లో టీమిండియా 69 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మొదటి మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ 1-1 తో సమ ఉజ్జీలుగా నిలవడంతో, ఈ నెల 14వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న మూడవ మ్యాచ్ లో సిరీస్ విజేత నిర్ణయం కానుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధావన్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి భారీ స్కోర్ కు బాటలు వేసాడు. రోహిత్ శర్మ 43, రేహనే 25, రైనా 30, పాండ్యే 27 పరుగులతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో పెరేరా వేసిన 19వ ఓవర్ లో చివరి మూడు బంతుల్లో పాండ్యే, రైనా, యువరాజ్ లు మూడు ఫుల్ టాస్ బాల్స్ అవుటై, పెరేరాకు హ్యాట్రిక్ సమర్పించారు.
భారీ లక్ష్య చేధనలో తొలి బంతి నుండే ఆరంభమైన శ్రీలంక కష్టాలు మ్యాచ్ టీమిండియా వశం చేసాయి. ఏ దశలోనూ లంకేయులు మ్యాచ్ లో పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లను కోల్పోయింది. అశ్విన్ 3, నెహ్రా 2, జడేజా 2, బూమ్రా 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి మ్యాచ్ లో ఓడిన టీమిండియాకు ఈ విజయం నూతన ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని అందించింది.





