‘మాటల మాంత్రికుడు’ పిలవబడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం అంతకంతకూ తగ్గుతూ పోతోందా? ఇటీవల హల్చల్ చేసిన ఓ సర్వే అదే విషయాన్ని ఖరారు చేయగా, తాజాగా, ఇండియా టుడే నిర్వహించిన సర్వే కూడా మోడీ గ్రాఫ్ తగ్గినట్లుగా చెప్తోంది. అయితే ఇదేమి ప్రమాదకర పరిస్థితులను సూచిండడం లేదు కానీ, ఇలాగే కొనసాగితే బిజెపికి తిప్పలు తప్పవన్న హెచ్చరికలనైతే చేస్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇండియా టుడే, కార్వీ ఇన్ సైట్స్ నిర్వహించిన ఈ సర్వే వివరాలను పరిశీలిస్తే… ప్రధాని పదవి రేస్ లో ఉన్న రాహుల్ గాంధీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో గతంతో పోలిస్తే మెరుగుపడ్డారని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సంఖ్య 286 స్థానాలుకు పరిమితమవుతుందని, 37 శాతం ఓట్లు మాత్రమే ఎన్డీయే వశమవుతాయని తెలిపింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది దేశంలో అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. ఇక, దేశంలో ప్రధాన సమస్యల గురించి ప్రస్తావిస్తే… 34 శాతం మంది ధరల పెరుగుదల, మరో 34 శాతం మంది అవినీతి, 7 శాతం మంది ఆర్థిక వ్యవస్థ, ఉగ్రవాదాలుగా చెప్పారు. నరేంద్ర మోడీ మంచి రోజులను తీసుకొచ్చారా? అంటే 40 శాతం అవునని, 31 శాతం మంది కాదని, 22 శాతం మంది పరిస్థితి మారలేదని చెప్పడం గమనార్హం.



