ఐ-ప్యాక్‌తో సెల్ఫీలు: ఓదార్పుకా… వీడ్కోలుకా?

Jagan Selfie Ipac

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తదితరులతో కలిసి గురువారం మధ్యాహ్నం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గల ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్ళారు.

పోలింగ్‌ సరళి చూసినప్పటి నుంచి వైసీపి నేతలందరూ ఓడిపోతామనే భయంతో ఆక్రోశిస్తున్నారు. కనుక ఈ ఓటమికి ఐ-ప్యాక్ బృందాన్ని నిందించి వారికి ప్యాకప్ చెప్పేందుకే జగన్‌ వెళ్ళారనుకుంటే, తమ పార్టీని మళ్ళీ గెలిపిస్తున్నందుకు వారిని అభినందించి వారితో సెల్ఫీలు దిగారు కూడా.

ADVERTISEMENT

జగన్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత ఎన్నికలలోనే 151/22 స్థానాలు సాధించాము. ఈసారి అంతకంటే ఇంకా ఎక్కువ సీట్లే సాధించబోతున్నాము. మీ అందరి కృషి వలననే ఇది సాధ్యం కాబోతోంది. కనుక ఎన్నికల తర్వాత కూడా వైసీపి కోసం మీ సేవలు కొనసాగిస్తాము,” అని అన్నారు.

ఈ సందర్భంగా ఐ-ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌ గురించి కూడా జగన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఆయన ఎక్కడ ఉన్నారో… ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. కానీ ఆయన మా గురించి ఏదేదో మాట్లాడుతున్నట్లు విన్నాము. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి ఆయన కూడా షాక్ అవుతారు. ఆయన కంటే రిషీ నేతృత్వంలో ఐ-ప్యాక్ టీమ్ చాలా అద్భుతంగా పనిచేస్తోంది,” అని జగన్‌ అన్నారు.

పోలింగ్‌ పూర్తయిన తర్వాత వైసీపి నేతల దాడులు, మీడియా ముందుకు వచ్చి వారు మాట్లాడుతున్న మాటలు అన్నీ వైసీపి ఓటమినే సూచిస్తున్నాయి. ఈ పరిస్థితులలో వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన జగన్‌ విదేశాలకు వెళ్లిపోతున్నారని మీడియాలో విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బహుశః అందుకే వైసీపి నేతలకు, కార్యకర్తలకు మనమే గెలుస్తామని నమ్మకం, ధైర్యం కలిగించేందుకే జగన్‌ ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చి ఉండవచ్చు. లేకుంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలాగే ఏపీలో వైసీపి కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని తీవ్ర భయాందోళనలు చెందుతున్న వైసీపి శ్రేణులు ఫలితాలు రాక మునుపే చెల్లాచెదురైపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. కనుక ఇది ఖచ్చితంగా వైసీపి శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రే అని భావించవచ్చు.

పార్టీ శ్రేణులకు ఆ నమ్మకం కలిగించడానికే ఎన్నికల తర్వాత కూడా ఐ-ప్యాక్ సేవలు కొనసాగిస్తామని జగన్‌ చెప్పారని అనుకోవచ్చు. కానీ పోలింగ్‌ మర్నాడే ఐ-ప్యాక్‌ని దుకాణం బంద్ చేయమని సజ్జల చెప్పిన్నట్లు గుసగుసలు వినిపించాయిగా!

ADVERTISEMENT
Latest Stories