చీటికీ మాటికీ కేరళ నుంచి హిట్టు సినిమాల హక్కులు తెచ్చేసుకోవడం ఇక్కడ రీమేక్ చేయడం పరిపాటిగా మారిపోయింది. వంద కోట్ల బడ్జెట్ తో తీసే చిరంజీవి పవన్ కళ్యాణ్ అయినా ఓ రెండు కోట్లలో చుట్టేసి లాభాలు మూటగట్టుకుందామనుకున్న బుట్టబొమ్మ లాంటి ప్రొడ్యూసర్లైనా అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. అలా అని ఒరిజినల్ వెర్షన్ లాగా ఇవేమైనా అద్భుతంగా ఆడి రికార్డులు సృష్టిస్తున్నాయా అంటే అదేమీ లేదు. అయితే యావరేజ్ లేదా డిజాస్టర్ ఇలా సాగుతోంది. ఫహద్ ఫాసిల్ సూపర్ హిట్ ని సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్యగా కష్టపడి చేసుకుంటే ఓటిటిలోనే సోసో రెస్పాన్స్ వచ్చింది.
నిజానికి మలయాళం రైటర్ల ఆలోచనా విధానం చాలా టిపికల్ గా ఉంటుంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయా అని షాక్ అవ్వాలి. ఉదాహరణకు ఆ మధ్య హెలెన్ అనే మూవీ వచ్చింది. పిజ్జా రెస్టారెంట్ లో పని చేసే హీరోయిన్ అనుకోకుండా ఫ్రీజర్ రూమ్ లో ఓ రాత్రి పూట ఇరుక్కుపోతుంది. చేతిలో ఫోన్ ఉండదు. హోటల్ మేనేజర్ తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. తండ్రి పోలీసులు ఎంత వెతికినా జాడ దొరకదు. చాల థ్రిల్ గా ఉంటుంది. మల్లువుడ్ లో ఇది సూపర్ హిట్టు. దీన్నే జాన్వీ కపూర్ హిందీ రీమేక్ లో నటిస్తే థియేటర్లలో ఆడలేక తుస్సుమంది. ఇంత టార్చర్ మాకొద్దు బాబోయ్ అనేశారు ఆడియన్స్
కొద్దిరోజుల క్రితం ఇరట్టా రిలీజయ్యింది. బాగానే ఆడింది. క్రిటిక్స్ ఆహా ఓహో అన్నారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చాక మన ప్రేక్షకులు సబ్ టైటిల్స్ సహాయంతో చూసేశారు. ఆసక్తికరమైన పాయింట్ తో సినిమా మొదలవుతుంది. హీరో జిజు జార్జ్ డబుల్ యాక్షన్. కవలలు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంటారు. పరమ శాడిస్ట్ అయిన తమ్ముడిని ఎవరో కాల్చి చంపుతాడు. అన్నయ్య ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వీళిద్దరి వైవాహిక జీవితం భ్రష్ఠుపట్టి ఉంటుంది. విచారణలో అది ఆత్మహత్యగా తేలుతుంది. కారణం ఏంటనేది క్లైమాక్స్ లో తేలుతుంది. ఇది చూశాక చాలా సేపు దాన్ని జీర్ణించుకోలేక కడుపులో తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది.
వావి వరసలు పట్టించుకోకుండా కేవలం సినిమాటిక్ లిబర్టీ పేరుతో చూపించే ఇలాంటి కథలు నిజంగా మనం ఏ మాత్రం అంగీకరించలేనివి. లవ్ స్టోరీలో బాబాయ్ పాత్ర పోషించిన రాజీవ్ కనకాల కూతురి వరసయ్యే సాయిపల్లవి మీద లైంగిక ఆలోచన పెట్టుకున్నాడన్న పాయింటే మనకు ఇబ్బందిగా అనిపించింది. దీన్ని ఇరట్టాలో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయారు. తప్పు చేసినవాళ్లకు శిక్ష అనే సందేశం బాగానే ఉంటుంది కానీ దాన్ని మరీ ఇంత అన్యాయంగా చూపించడం సరికాదు. ఇందుకేనేమో ఇరట్టాని మనవాళ్ళు రీమేక్ హక్కులను కొనే సాహసం కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. ఇవి రాకపోవడమే మంచిది



