
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ రెండేళ్ళుగా శాసనసభకు, ప్రజల మధ్యకు రాకుండా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తున్నారు. కనుక అయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ “కేసీఆర్ గోడకి వ్రేలాడదీసిన తుపాకీ వంటివారు… తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ తుపాకీ పేలుతుందని,” కొడుకు కేటీఆర్ తండ్రిని గట్టిగా సమర్ధించుకున్నారు.
ఆయన చెప్పినట్లుగానే ఈ నెల 19న కేసీఆర్ ఫామ్‌హౌసులో నుంచి బయటకు వచ్చి తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులతో అందరూ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వారికి దిశానిర్దేశం కంటే ముందు తన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై కూతురు కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు కేసీఆర్ ధైర్యంగా సమాధానాలు చెప్పడం చాలా అవసరం.
కేటీఆర్, హరీష్ రావులతో సహా పార్టీ ముఖ్య నేతలందరూ వేలాది ఎకరాలు భూకబ్జాలు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కట్టప్ప వంటివారని, ఏదోరోజు కేటీఆర్‌ని కూడా బయటకు పంపించేస్తారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కనుక కేసీఆర్‌కి ధైర్యం ఉంటే ముందుగా ఆమెకు జవాబులు చెప్పడం అవసరం. ఇంకా ధైర్యం ఉంటే ఇకపై ఆమెని బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదని కేసీఆర్ స్పష్టం చేయాలి. ఆమె చేసిన తప్పులు లేదా అవినీతిని ఇకపై బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తుందని హెచ్చరించాలి. కానీ తండ్రి హృదయం అందుకు అంగీకరిస్తుందా?అనుమానమే.
సొంత కుటుంబం, పార్టీలో ఈ సమస్యలని కేసీఆర్ పరిష్కరించుకోకుండా, కాంగ్రెస్, బీజేపిలను వేలెత్తి చూపి విమర్శించినా, రాష్ట్రాన్ని తానే ఉద్దరిస్తానని చెప్పుకున్నా ప్రజలు నవ్వుకుంటారు. రాజకీయ ప్రత్యర్ధులు ఎదురుదాడి చేస్తే తట్టుకోవడం చాలా కష్టం.
ఇంతకాలం కేసీఆర్ మౌనంపై చర్చ జరిగింది. ఇప్పుడు మాట్లాడితే చర్చ జరుగుతుంది. కనుక ఆయన మౌనం, మాట రెండూ సంచలనమే అని కేటీఆర్ చెప్పిన మాట మాత్రం వాస్తవమే.
ఫలానా అబ్బాయి లేదా అమ్మాయి కనిపించుట లేదు. మా పెంపుడు కుక్క కనిపించుట లేదు.. వంటి వార్తలు తరచూ చూస్తూనే…
The celebrities in the Bigg Boss house are unnecessarily spoiling their own game because they…