తుపాకీ ఎందుకు పేలడం లేదూ?

Is KCR’s Silence Strategic or a Sign of Political Retreat?

తెలంగాణలో కేసీఆర్‌ రెండేళ్లుగా ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తున్నారు. పార్టీని కొడుకు కేటీఆర్‌కు, మేనల్లుడు హరీష్ రావు చేతిలో పెట్టేశారు. వారిద్దరి నేతృత్వంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లవుతోంది.

మొన్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓడిపోయింది. నిన్న మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైంది. ఈ లెక్కన రేపు రెండో విడతలో మూడో స్థానానికి మారుతుందేమో? అని కాంగ్రెస్‌ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ కోత తాత్కాలికమేనా లేక భవిష్యత్తుకి సంకేతమా?

ADVERTISEMENT

మరోపక్క కూతురు కవిత తన తండ్రి హయాంలో అభివృద్ధి తక్కువ, అవినీతి ఎక్కువ జరిగిందని బాంబులు పేలుస్తూనే ఉన్నారు. అల్లుడు (తన భర్త) ఫోన్‌ను మావగారు (తండ్రి) ట్యాపింగ్ చేయించారంటూ నిన్న మరో బాంబు పేల్చారు.

అయినా ‘గోడకు వేలాడదీసిన తుపాకీ’లాంటి కేసీఆర్‌ పేలడం లేదు. ‘తప్పకుండా పేలుతుంది’ అని కేటీఆర్‌ గ్యారెంటీ ఇస్తున్నారు. కేసీఆర్‌ మౌనం కూడా వ్యూహాత్మకమే అని సర్ది చెప్పుకుంటున్నారు.

అయితే ఇది వ్యూహాత్మకంగా కంటే అస్త్ర సన్యాసంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమనుకుంటే ఎందుకు? అనే ప్రశ్న తలెత్తుతుంది.

జవాబు కోసం ఓసారి అలా… తమిళనాడు వరకు వెళ్లాల్సి వస్తుంది.

తమిళనాడు సీఎం జయలలిత ఆకస్మిక మరణం తర్వాత ఆమె స్నేహితురాలు శశికళ ఆ కుర్చీలో కూర్చొని చక్రం తిప్పాలనుకున్నారు. కానీ తర్వాత ఏం జరిగిందో… ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు.

ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకున్న శశికళ నాలుగేళ్లు జైలులో కూర్చోవాల్సి వచ్చింది. బయటకు వచ్చి మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న శశికళ హఠాత్తుగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించి తప్పుకున్నారు.

కాస్త రాజకీయ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదంతా అర్థమవుతుంది. కనుక విడమరిచి చెప్పుకోవడం అవసరం లేదు. అది ఆరోగ్యానికి హానికరం కూడా!

కనుక శశికళ స్టోరీ నేపథ్యాన్ని కేసీఆర్‌ అస్త్ర సన్యాసానికి అన్వయించి చూస్తే స్టోరీలో ఏదో క్లారిటీ కనిపిస్తుంది. ఇదంతా ఊహాజనితమని కొట్టి పారేసేవారున్నారు. వారు ఓసారి బీఆర్ఎస్‌ పార్టీ విలీనంపై కల్వకుంట్ల కవిత చెప్పిన ముక్కలు గుర్తు చేసుకుంటే చాలు.. క్లారిటీ వస్తుంది. కనుక కేసీఆర్‌ అస్త్ర సన్యాసం వ్యూహాత్మకమే కానీ అందరూ అనుకుంటున్నట్లు కాదనిపిస్తుంది.

ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి ప్యాలస్‌ నుంచి బయటకు రావడం లేదు. ఇదే కారణమా? బయటకు వస్తారా? ఏమో?

ADVERTISEMENT
Latest Stories