తుని ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్ వంగవీటి రంగా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాపులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని విమర్శలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రి దేవినేని ఉమా ఉన్నారని జగన్ వ్యాఖ్యానించగా, దీనికి బదులుగా స్పీకర్ స్పందించారు.
“తానూ హోంమంత్రిగా ఉన్నపుడు రంగా హత్య జరిగిందని, అలాగే ఆ తర్వాత రాష్టంలో అల్లర్లు, లూటీలు, ఆందోళనలు పెద్ద ఎత్తున చెలరేగాయని, దీనికి బాధ్యత వహిస్తూ ఆనాడూ తానూ పదవికి రాజీనామా చేసానని, అయినా వంగవీటి రంగాతో తనకు స్నేహం తప్ప, వైరం లేదని” కోడెల ఆనాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ గతాన్ని ప్రజల ముందుంచారు.
“అన్నీ విషయాలు అసెంబ్లీలో చర్చిస్తానని బయట చెప్పి, సమావేశాలు ప్రారంభం కాగానే సభా సమయాన్ని వృధా చేస్తూ పారిపోయే జగన్ పార్టీ సభ్యులు, ఇదంతా తమ వాడు చెప్తేనే చేస్తున్నామని చెబుతున్నారు, ఇంత కంటే సిగ్గుచేటు లేదు మీకు” అంటూ జగన్ పై మండిపడ్డారు. స్పీకర్ గా చెప్పకూడదు, అయినా ఆవేదనతో ప్రజలకు నిజాలు తెలియజేయాలని చెప్తున్నానని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తేనే తుని ఘటన జరిగిందని ప్రజలు అనుకుంటున్నారని, పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తుందని, తెల్లారి లెగిస్తే అక్రమాస్తుల కేసులతో కోర్టుల చుట్టూ తిరిగేవాడివి, నా సంగతేంటో, నీ సంగతేంటో దేశం మొత్తానికి తెలుసని, తండ్రి పోయినా పర్వాలేదు నాకు పదవి కావాలనుకున్నవాడివి ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం నీ క్రిమినల్ తీరుకు అద్ధం పడుతుందని, నన్ను క్రిమినల్ అంటున్న నీకు అసలు క్రిమినల్ ఎవరో తెలియాలంటే వెళ్లి అద్ధం ముందు చూసుకోమంటూ” తీవ్రంగా స్పందించారు.
20 నెలలుగా ఒక్క రాజకీయ నాయకుడిపై గానీ, పార్టీపై గానీ మాట్లాడని తానూ ఈ రోజు స్పందించడానికి కారణం ప్రజలకు నిజాలు చెప్పడానికేనని, ఇప్పటికైనా జగన్ తీరును మార్చుకోవాలంటూ పలు సూచనలు చేసారు కోడెల. మరికొద్ది రోజుల్లోనే ఈ ఘటన ఎవరి వలన జరిగింది? దీని వేనుకున్నది ఎవరు? అనే నిజానిజాలు బయటకు వస్తాయని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు కోడెల.





