ఇండి కూటమి వైపు జగన్ చూపులు అంటూ గత కొన్ని రోజులుగా ఇటు ఒక వర్గం మీడియాలో అటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం ఊపందుకుంది. అయితే ఇండి కూటమిలో భాగస్తులైన కమ్యూనిస్టు నాయకులు తాజాగా తాడేపల్లిలో జగన్ తో భేటీ అయ్యారు.
దీనితో ఆ ప్రచారానికి మరింత రాజకీయ వెయిట్ పెరిగింది. గత మూడు దఫాలుగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత తప్పదని, అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు తటస్తంగా, బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఇండి కూటమితో జత కట్టేందుకు తెరచాటు రాజకీయాలు నడుపుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలోని వైసీపీ కూడా ఇండి కూటమి లో భాగమయ్యేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తన పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపుతున్నారా.? అయితే ఇండి కూటమి కోసం జగన్ వైసీపీ ద్వారాలు తెరిస్తే ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో డోర్స్ మూసుకున్నట్టేనా.?
ఒకే ఒరలో రెండు కత్తులు సాధ్యమా.? తాజాగా షర్మిల కుమర్తె అంజలి నిశ్చితార్ధ వేడుకకు కూడా మేనమామ గా జగన్ హాజరు కాలేదు. దీనితో జగన్ – షర్మిల మధ్య బంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అన్నది స్పష్టమయింది. ఈ నేపథ్యంలో జగన్ ఇండి కూటమికి మద్దతు తెలపడం అంటే కాంగ్రెస్ లో షర్మిల రాజకీయ ప్రయాణానికి ఎండ్ కార్డు పడినట్టే భావించాలి.






