జగన్ అవినీతి కేసులలోని నిందితులు రకరకాల పిటిషన్స్ తో కేసుల విచారణ జరగకుండా ఆపుతున్నారని సిబిఐ ఆరోపిస్తుంది. తమ కేసులన్నిటిని ఒకేసారి విచారించాలని జగన్, విజయసాయిరెడ్డి వేసిన పిటీషన్ పై సిబిఐ కోర్టు నిన్న విచారణ జరిపింది. అయితే ఈ అభ్యర్ధనను సిబిఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు.
నేరాలన్నీ.. విడివిడిగా చేశారని.. నిందితుల్లో కామన్‌గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ.. ఇతర నిందితులు మాత్రం వేరని స్పష్టం చేసింది. ఈ తరుణంలో జగన్ కేసులకు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కేసులకు పోలిక పెట్టింది సిబిఐ. ఆ కేసుల్లోనూ.. విడివిడిగా విచారణ జరిపి… విడివిడిగానే శిక్షలు విధించిన సంగతిని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది.
ఏడేళ్ల నుండి ఈ కేసుల విచారణ మొదలు కానే లేదు. విచారణ ప్రారంభం కాకుండా ఒక పథకం ప్రకారమే డిశ్చార్జ్ పిటిషన్స్ వేసి ఆలస్యం చేస్తున్నారని సిబిఐ ఆరోపణ. గతంలో ఎన్నడూ లేని విధంగా సీబీఐ ఈ కేసులలో తీవ్రంగా స్పందిస్తుంది. మొన్న ఆ మధ్య వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరితే జగన్ ఇప్పటికే సాక్షులను ప్రభావితం చేశారు అంటూ వ్యాఖ్యానించింది.
ఇప్పుడు కొత్తగా వేసిన పిటిషన్‌పై.. మరింత ఘాటుగా వాదనలు వినపించింది. విచారణ ఆలస్యం చేయడానికే.. ఇలా చేస్తున్నారని మండిపడింది. దీనితో కేంద్రం జగన్ ను ఈ కేసులతో ఇబ్బంది పెడుతుందా అనే అనుమానాలు రాకమానవు. అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయంగా ఒకింత అసహనంగానే ఉన్నారు.





