రేపు కేసీఆర్‌తో సింగిల్ సింహం భేటీ… ఎవరిపై జాలి పడాలో!

KCR_Jagan

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌ వెళ్ళి మాజీ సిఎం కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తీవ్రంగా కలత చెందిన కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో కాలుజారిపడగా యశోదా ఆస్పత్రిలో మూడు వారాల క్రితం తుంటి ఎముక మార్పిడి చికిత్స చేయించుకొన్నారు.

ADVERTISEMENT

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకొంటున్నారు. ఇన్ని రోజుల తర్వాత జగన్మోహన్‌ రెడ్డి ఆయనను పరామర్శించేందుకు రేపు హైదరాబాద్‌ వెళుతున్నారు.

అయితే కేసీఆర్‌ ఆస్పత్రిలో ఉండగానే చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారు. కానీ ఆయన వలన సాయం పొందిన జగన్మోహన్‌ రెడ్డి మాత్రం రాలేదని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకొన్న తర్వాత జగన్మోహన్‌ రెడ్డి వచ్చి పరామర్శించడం విచిత్రంగానే ఉంది.

పైకి ఇది పరామర్శ అని చెప్పుకొంటున్నప్పటికీ, ఇది ఖచ్చితంగా వైఎస్ షర్మిల ఎఫెక్టే అని అనిపించకమానదు. ఆమె ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టి టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకొంటారని, అప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబాలను చీల్చి రాజకీయాలు, కుట్రలు చేస్తారని జగన్మోహన్‌ రెడ్డి ఈరోజే బటన్ నొక్కుడు సభలో ఆవేదన వ్యక్తం చేశారు కూడా.

కనుక ఆమెను ఏపీ రాజకీయాలలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు ఏవైనా మార్గాలున్నాయా?ఒకవేళ ఆమె వస్తే టిడిపి, జనసేనలతో పొత్తులు పెట్టుకోకుండా ఏవిదంగా అడ్డుకోవాలి? సొంత చెల్లెలే విమర్శిస్తుంటే ఆమెకు ఏవిదంగా జవాబులు చెప్పాలి? ఏవిదంగా ఆమెను ఎదుర్కోవాలి?

ఆమె వైసీపిని చీల్చడానికి ప్రయత్నిస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఆమె ప్రభావం ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపై ఏమేరకు ఉంటుంది? రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని కూడా ఏపీలో దింపితే లాభామా… నష్టమా?వంటి అనేక ప్రశ్నలకు కేసీఆర్‌ వద్దే సమాధానాలు లేదా పరిష్కారాలు దొరుకుతాయి. కనుక పరామర్శ పేరుతో కేసీఆర్‌తో భేటీ అవుతున్నట్లు భావించవచ్చు.

పనిలో పనిగా రాబోయే ఎన్నికలలో కూడా మళ్ళీ తనకు సాయపడి ముఖ్యమంత్రి పదవి దక్కేలా చేస్తే, లోక్‌సభ ఎన్నికల తర్వాత అవసరమైతే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో వెన్నంటి నడుస్తానని డీల్ చేసుకొనే అవకాశం ఉంది.

అయితే నాకు ఎవరితో పొత్తులు లేవు… నాకు సొంత మీడియా లేదు… తోడేళ్ళ మూకతో సింగిల్ సింహంలా పోరాడి ఈసారి 175 సీట్లు గెలుచుకోబోతున్నాను…” అంటూ పదేపదే చెపుతూ, మళ్ళీ కేసీఆర్‌తో సంప్రదింపులు, సలహాలు దేనికి?ఆయనే ఎన్నికలలో ఓడిపోయి, తుంటి ఎముక విరిగి ఇంట్లో కూర్చొని ఉంటే, మన సింగిల్ సింహం వెళ్ళి ఆయన సాయం కోరడం చూస్తే ఎవరిని చూసి జాలిపడాలో అనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories