సినీ సెలబ్రేటీలు చేసే పొలిటికల్ డైలాగ్స్ కు ఎప్పుడూ ప్రాధాన్యత లభిస్తాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసారు ‘మ్యాన్లీ స్టార్’ జగపతిబాబు. ఉగాది పర్వదినం రోజు ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూలలో… ‘త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా..?’ అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు జగపతిబాబు ఓ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
“పొలిటికల్ గా తనకు అంత ఆసక్తి లేదు గానీ, ఒక నాయకుడిగా చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉందని” అన్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా కంటే కూడా ఒక వ్యక్తిగా చంద్రబాబు అంటే తనకు అత్యంత గౌరవమని, హైదరాబాద్ ను పెళ్లికూతురులా ముస్తాబు చేసిన విధానం తనకు ఎంతో నచ్చిందని, హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తర్వాత దిగిపోయారని, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను ఒక ‘పెళ్లి కూతురు’లా ముస్తాబు చేయాలంటే అది ఒక్క చంద్రబాబు వలనే అవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని” చంద్రబాబు నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారు.
అలాగే పార్టీ పరంగా తెలుగుదేశంకు ఎలాంటివి చేయడానికైనా తాను సిద్ధమే… గతంలో కూడా ప్రచార కార్యక్రమాలు చేశాను… కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి తనకు అసలు ఏమీ తెలియదని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చాయి గానీ, తనకు తెలియదని దాంట్లో తలదూర్చనని ఓ స్పష్టమైన ప్రకటన చేసారు. జగపతిబాబు మాదిరే రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబుపై విశ్వాసం ఉంచారు కాబట్టే… ఈ రోజున అధికారంలో ఉన్నారు. అయితే సహజంగా సినీ సెలబ్రిటీల వ్యాఖ్యలు ఆకాశంలో ఉంటాయి. కానీ, అందుకు విరుద్ధంగా జగపతిబాబు ప్రజల ఆలోచనలకు దగ్గరగా మాట్లాడారని చెప్పాలి.



