దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ”పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్దీ అంచనాలు పెరుగుతూ పోతున్నాయి తప్ప, ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ‘జై’ పాత్రను పరిచయం చేసిన టీజర్ ట్రేడ్ వర్గాలలో కలకలం రేపగా, ‘లవ’ పాత్రను పరిచయం చేసే టీజర్ ఆగష్టు మొదటి వారంలో రానుందన్న టాక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది.
ఇదిలా ఉంటే మరో వైపు సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ సందడి చేస్తున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ రాజకీయ పార్టీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకై హల్చల్ చేయగా, తాజాగా మరో స్టిల్ అభిమానుల కంట పడింది. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ విలన్ అభిమన్యు సింగ్ ను ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో నెట్టింట హడావుడి చేస్తోంది.
‘జై’ పాత్రకు సంబంధించిన స్టిల్ లా కనపడుతున్న ఈ ఫోటోలో మీసం మెలితిప్పి, చెవికి రెండు పోగులు పెట్టుకుని తారక్ కన్నులవిందు చేస్తున్నాడు. ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ లో ‘జై’ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోలో కనపడుతున్న కాస్ట్యూమ్స్ కూడా ‘జై’ పాత్రకు సంబంధించినవేనని స్పష్టం చేస్తున్నాయి.


