‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కాస్త ‘బల్బ్ స్టార్’గా అవతరించడమేమిటి? అనుకుంటున్నారా..! అంతే… బడా స్టార్లు చేసే ఒక చిన్న తప్పిదం, ఎంత సందడి చేయాలో అంత హంగామా సృష్టిస్తోంది. ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్ధులతో భేటీ అయిన అనంతరం ప్రసంగించిన ‘జనసేన’ అధినేత నోటి వెంట ఒక చిన్న తప్పిదం వెలువడింది. అయితే తొలి రెండు, మూడు రోజుల్లో దీనికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అనంతపురం నుండి పోటీ చేస్తారనేదే హైలైట్ కాగా, ప్రస్తుతం మాత్రం ‘బల్బ్ స్టార్ పవన్ కళ్యాణ్’ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఓడిపోతానని తెలిసే అనంతపురంలో పోటీ చేస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్… ఈ సందర్భంగా ఓ విషయాన్ని ప్రస్తావించారు. ఐన్ స్టీన్ చెప్తారు… ఒక బల్బ్ ప్రతిసారి ఫెయిల్ అయినపుడు, దీనిని ఎలా నిర్మించకూడదు అనేది తెలుసుకోవడం అంటారు… అలాగే ఓడిపోయినపుడు తాను కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తానని వివరించే ప్రయత్నం చేసారు. ఈ మాటలు అన్నపుడు అక్కడున్న మీడియా వర్గీయుల నుండి, అలాగే విద్యార్ధులు కూడా చప్పట్లతో పవన్ కు అభివాదాలు పలికారు. కానీ పవన్ పలికిన మాటల్లోని తప్పును గుర్తించలేకపోయారు. మీడియా వర్గీయులు వదిలేశారేమో గానీ, సోషల్ మీడియా వదలదు కదా..!
ప్రస్తుతం అదే జరుగుతోంది… థామస్ ఆల్వా ఎడిషన్ అనే స్థానంలో పవన్ పొరపాటున ఐన్ స్టీన్ అని పలకడంతో… నెటిజన్లకు ఆహారం లభించినట్లయ్యింది. అందులోనూ పలికింది పవర్ స్టార్ కావడంతో అది మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది. గతంలో జలీల్ ఖాన్ బికాంలో ఫిజిక్స్ సందడి చేసిన స్థాయిలో, ప్రస్తుతం పవన్ విషయం కూడా అంతే హంగామాను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కు కొత్త బిరుదు ‘బల్బ్ స్టార్’ అన్న ట్యాగ్ లైన్ ను యాడ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. గతంలో మహేష్ బాబు చేసిన ట్వీట్ లో ఓ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కు పవన్ ఫ్యాన్స్ సృష్టించిన పేద్ద హంగామాకు, రివేంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిదంటూ ప్రిన్స్ అభిమానులు కూడా ఇందులో ఓ హ్యాండ్ వేస్తున్నారు.



