
ప్రభుత్వంలో అరుంధతి నక్షత్రాలు గా మారిపోయారు జనసేన ఎమ్మెల్యే లు. 2024 ఎన్నికలలో 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 నియోజకవర్గాలకు 21 నెగ్గి దేశ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించిన జనసేన, అటు పిమ్మట కూటమి ప్రభుత్వంలో భాగమయ్యింది.
అయితే నాటి నుంచి నేటి వరకు గెలిచిన జనసేన ఎమ్మెల్యే లలో మంత్రులుగా ప్రమోషన్ దక్కించుకున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మినహాయిస్తే ఆ మిగిలిన 18 మంది నాయకులు పెళ్ళిలో వధూవరులకు కనిపించే అరుంధతి నక్షత్రం మాదిరి కనిపించి కనిపించక వ్యవహరిస్తున్నారు.
పెళ్లి ఆఖరి ఘట్టం లో పంతులు గారు వధూవరులకు ఆకాశంలో అరుంధతి నక్షత్రం ను చూపిస్తారు. అయితే ఆ సమయంలో ఆ నక్షత్రం ఆకాశంలో ఉన్నా, లేకున్నా ఉన్నట్టుగానే భావించే నూతన జంట మాదిరి ఏపీ ప్రజలు కూడా జనసేన ఎమ్మెల్యే లను చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
అయితే ఈ పరిస్థితి ఒక్క జనసేనకు మాత్రమే పరిమితం కాలేదు. అటు కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకున్న వైసీపీ లో కూడా ఒక్క జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది నాయకులు ఇప్పటి వరకు ఎక్కడ కనిపించింది లేదు.
అలాగే అటు బీజేపీ విషయంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. మంత్రి పదవులు దక్కించుకున్న నేతలు మినహాయిస్తే మిగిలిన వారి ఆచూకీ ఎవరికీ తెలియదు. అయితే ఇటు బీజేపీ విషయానికొస్తే ఏపీలో స్వశక్తితో బీజేపీ బలం పుంజుకోవడం అన్న మాట అసాధ్యం అన్న విషయం బీజేపీ అధిష్టానికి సైతం తెలిసిన అంశమే.
కాబట్టి బీజేపీ నాయకులు తమ ఉనికిని చాటుకుంటూ, పార్టీ బలోపేతానికి ముందుకురారు. దాని వల్ల వారికి కానీ వారి పార్టీకి కానీ పెద్ద ఒరిగేది కానీ తరిగేది కానీ ఏమి ఉండదు. అలాగే వైసీపీ విషయానికొస్తే, వైసీపీ టీడీపీ మాదిరి సంస్థాగతంగా బలం ఉన్న పార్టీ.
స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి స్థాయిలోను వైసీపీ తన బలాన్ని నిరూపించుకుంది. అలాగే వైసీపీ ఆర్థికంగా కూడా దేశంలోనే బలమైన పార్టీగా ఎదిగిపోయింది.
కానీ జనసేన పార్టీ పరిస్థితి ఆ రెండు పార్టీల మాదిరి కాదు. ఇటు బీజేపీ మాదిరి పట్టనట్టు ఉండలేదు, ఇటు వైసీపీ మాదిరి బలంగా ఎదగలేదు. గత దశాబ్ద కాలం నుండి ఎన్నో అవమానాలను, మరెన్నో అవహేళనను ఎదుర్కొని, ప్రజా పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చింది జనసేన.
ఆ అవమానాలకు ఈ పోరాటాలకు మధ్య అధికారంలోకి వచ్చిన జనసేన అధికారంలో ఉన్న ఐదేళ్ల విలువైన సమయాన్ని ఇలా వృధా చేసుకోకూడదు. గెలిచిన ఎమ్మెల్యే లంతా ఆయా నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి నడుం బిగించాలి. స్థానిక నాయకులను తయారు చేయగలగాలి.
ప్రజలకు దగ్గరగా ఉంటూనే తాము నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకొంటూ పార్టీని పటిష్టం చేసుకోవాలి.
కానీ ఆ దిశగా ఒక్క జనసేన ఎమ్మెల్యే కూడా అడుగులు వేసిన దాఖలాలు కనిపించడం లేదు. గెలవక ముందు పవన్ బొమ్మే, గెలిచిన తరువాత పవన్ గుర్తింపే అన్నట్టుగా జనసేన ఎమ్మెల్యే ల వయ్వహార శైలి కనిపిస్తుంది. ఇకనైనా పెళ్ళిలో కనిపించే అరుంధతి నక్షత్రం మాదిరి కాకుండా నిత్యం కనిపించే నక్షత్రాలు మాదిరి జనసేన నాయకులు వెలగాలని ఆశిద్దాం.
Nikita Sharma is turning up the tropical heat with her latest breathtaking beach photoshoot, proving…
After the back to back failures of Toxic and Hi, Nayanthara's next release will most…