
తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరడంతో ఇక నువ్వా – నేనా అన్నట్టుగా ప్రచార హోరు పెంచుతున్నారు తెలంగాణ రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే, మరికొంతమంది పార్టీల గెలుపోటముల మీద బెట్టింగ్ లతో దూసుకుపోతున్నారు. మరికొంత మంది సర్వేల పేరుతో ప్రజలను గందరగోళంలో పెడుతున్నారు.
అయితే మరికొంత మంది రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణ రాజకీయాలను ఆంధ్రా రాజకీయాలలో సరిపోలుస్తూ ఏపీలో రానున్న ఎన్నిక వేడికి ఇప్పటి నుంచే పొగ రాజేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఎన్నికలు ఏపీలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి,ఏపీలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏర్పడిన టీడీపీ – జనసేన పార్టీల పొత్తు హైద్రాబాద్ లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది, సీమాంధ్ర ఓటర్ల నాడీ ఏ పార్టీ నేతల వైపు మళ్ళుతుంది అంటూ తమ తమ విశ్లేషణలకు పదును పెడుతున్నారు.
బాబు అరెస్టు సమయంలో టీడీపీ పార్టీకి బేషరతు మద్దతు పలికిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల బరిలో బీజేపీ తో పొత్తుపెట్టుకుని 8 స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీకి తెలంగాణ లో పోటీని విరమించుకున్న టీడీపీ పార్టీ మద్దతు దక్కుతుందా? ఆ పార్టీ సానుభూతి పరులు జనసేన వైపు చూస్తారా?పసుపు తమ్ముళ్లు ఎర్ర తుండు వేసుకుంటారా? అనేది సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి ఎన్నికల పలితాలతో తేలిపోతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు మీడియాలో తమ విశ్లేషణలను వండి వడ్డిస్తున్నారు.
కూకట్ పల్లి సీటు జనసేన పార్టీ గెలుచుకుంటే టీడీపీ తమ్ముళ్లు జనసేన పొత్తును ఒప్పుకున్నట్లు అలా కాకుండా జనసేన ఆ స్థానంలో విజయాన్ని అందుకోలేకపోతే టీడీపీ – జనసేనల పొత్తు ఏపీలో కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపలేదంటూ ప్రచారాలు మొదలుపెట్టారు కొందరు రాజకీయ మేధావులుగా చెప్పబడే బ్లూ బ్యాచ్ వర్గాలు. ఒక్క నియోజకవర్గం గెలుపోటములను దృష్టిలో ఉంచుకుని రెండు పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు బంధం చెల్లదు అంటే అలాంటి వారిని ఏమనాలి? అటువంటి విశ్లేషణను ఎలా నమ్మాలి?
పెళ్లి అనే బంధంతో ఏకమైనా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగిన, ఒక మనస్పర్ధ వచ్చినా ఇక ఆ బంధానికి విలువలేదు ఇక మీ ఇద్దరు కలిసి ఉండే ప్రసక్తే లేదు అంటూ బంధాన్ని తెగతెంపులు చేస్తారా లేకా కొత్త బంధాలలో ఇమడడానికి కొంత సమయం పడుతున్నది, ఆ బంధం బలపడడానికి కొంత టైం ఇవ్వాలని నచ్చ చెపుతారే తప్ప మీరు విడిపోండి అంటూ కలిపినా వారే విడగొట్టారు కదా!
ఇదైనా అంతే… రెండు పార్టీల కార్యకర్తలు ఏదైనా సందర్బాల్లో విభేదించుకుంటే వారికి నచ్చ చెప్పి పొత్తు ధర్మాన్ని పాటించేలా చర్యలు తీసుకోవడానికి ఆయా పార్టీల అధినేతలు ఉంటారు. అయినా ముందునుంచి తెలంగాణ లో జనసేన పార్టీ క్రియాశీల పాత్ర పోషించనేలేదు. రాజకీయ యాత్రలు చేయలేదు, ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించనూలేదు. కేవలం తన ఉనికిని నిలబెట్టుకోవడానికి జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచింది అనేది వాస్తవం.తమ అభ్యర్థులు గెలిస్తే జనసేనకు అదిఒక అదనపు బలమవుతుంది. ఒకవేళ గెలవలేకపోతే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఇదొక అవకాశంగా తీసుకుని ముందుకెళ్తారు.
అయితే ఏపీలో టీడీపీ కి మద్దతుగా నిలబడిన జనసేనకు టీడీపీ సానుభూతిపరులు ఓటు వేస్తారా లేదా అనేది ఒక్క పవన్ చేతిలోనో లేక బాబు చేతిలోనో ఉండదు. ఒక్కోసారి రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఏ పార్టీ వేవ్ ఉంటుందో అటువైపే ఓటర్లు మొగ్గుచూపుతారు. ఉదాహరణకు 2019 ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ దూకుడు కనపడడంతో తమ ప్రాంతంలోనే రాజధానిని ప్రకటించిన చంద్రబాబుని టీడీపీ పార్టీని కాదని వైసీపీ పార్టీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీనే అయితే ఇక్కడి ప్రజలు తమ పార్టీకి ఓటు వేయలేదు అనే కారణంతో ఆ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తారేమో అనే భయం కూడా ఆ ప్రాంత ప్రజలు అలా నిర్ణయం తీసుకునేలా చేయవచ్చు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతుంటాయి.వాటిని ప్రామాణికంగా తీసుకుని ప్రజల మూడ్ ని కొంత వరకు అంచనా వేయవచ్చు కాని దాన్నే అంతిమ ప్రామాణికంగా పరిగణించకూడదు అనేదానికి ఎన్నో సంఘటనలు సాక్ష్యాలుగా ఉన్నాయి.దీనికి కూకట్ పల్లి కూడా మినహాయింపేమీ కాదు అనేది గ్రహించాలి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…