టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోకపోయినా, అంతకు మించిన పేరుప్రఖ్యాతలను జూనియర్ ఎన్టీఆర్ సొంతం చేసింది ‘టెంపర్’ సినిమా. అలాగే పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా తెచ్చిపెట్టిన ‘టెంపర్’ సినిమాను ఇటీవలే హిందీ భాషలోకి డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేసారు. హిందీలోకి డబ్ అయిన తెలుగు సినిమాలకున్న ఆదరణను ‘టెంపర్’ మరోసారి చాటిచెప్పింది. అయితే గత సినిమాల రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో ‘టెంపర్’కు వీక్షకుల ఆదరణ దక్కుతోంది.
యూ ట్యూబ్ లో విడుదల చేసిన రెండు రోజులకే ఈ సినిమా 1 మిలియన్ హిట్స్ ను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. సాధారణంగానే యూ ట్యూబ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు విశేష ఆదరణ ఉంటుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం చవిచూసిన “రామయ్యా వస్తావయ్యా…” సినిమా యూ ట్యూబ్ లో ఆల్ టైం రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే హిందీలోకి డబ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు ‘నరసింహుడు, నా అల్లుడు’ వంటి తదితర సినిమాలకు కూడా యూ ట్యూబ్ లో మంచి ఆదరణ చూరగొన్నాయి.
మొత్తానికి యూ ట్యూబ్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సత్తా చూపుతుండడం ‘యంగ్ టైగర్’ అభిమానులకు మిక్కిలి సంతోకరమైన వార్త. అయితే అన్నింటికంటే ప్రస్తుతం సందడి చేస్తున్న ‘టెంపర్’ సినిమా మాత్రం ప్రత్యేకం. వరుస పరాజయాలతో డీలా పడ్డ జూనియర్ ఎన్టీఆర్ ను గాడిలో పెట్టిన సినిమాగా ‘టెంపర్’ జూనియర్ కెరీర్లో నిలిచిపోతుంది. అందుకే ‘టెంపర్’ పేరెత్తగానే బుడ్డోడు అభిమానులకు ఎక్కడలేని ఊపు వస్తుంది.



