సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న ఇమేజ్ ను మార్కెట్ వర్గాలు ఎంతలా వినియోగించుకుంటున్నాయో తెలిసిన విషయమే. విమానాలు, కార్లు, బ్యాంకులు, వాట్సప్ లు వంటి ప్రధాన సంస్థలపై ఇప్పటికే ‘కబాలి’ ప్రభావం పడగా, తాజాగా యుఎస్ఎ హక్కులు పొందిన ‘కబాలి’ డిస్ట్రిబ్యూటర్ ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది.
యుఎస్ లో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే ‘సినీ గాలక్సీ’ యాజమాన్యం, రజనీకాంత్ పోస్టర్లతో టీ షర్టులను రూపొందించింది. సాధారణంగా ఇలాంటి టీ షర్టులు స్థానిక మార్కెట్ వర్గాల్లో సందడి చేయడం షరామామూలు విషయమే అయినా, ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ రకమైన ప్రచారానికి తెరలేపడం ఇదే మొదలు. దీంతో మున్ముందు స్థానికంగా కూడా ఇలాంటి ప్రచారానికి పంపిణీదారులు తెరలేపుతారేమో చూడాలి.
ఈ రకంగానూ ‘కబాలి’ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ… ఇండియాలో అసలైన ‘ట్రెండ్ సెట్టర్’ ఎవరనేది చాటి చెప్తున్నారు. ఇన్ని అంచనాలు ఉన్న మరి ఈ ‘కబాలి’ ధియేటర్లలో ఎప్పుడు దండయాత్ర చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘కబాలి’ ల్యాండింగ్ ఈ నెల 22వ తేదీనే అంటున్నారు. అయితే అధికారిక ప్రకటన కోసమే సర్వత్రా వేచిచూస్తున్నారు.



