
కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో ఒంటరి ప్రయాణం చేయగలరా? తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోవడం ఖాయమేనా? అనే అనుమానాలు, ఊహాగానాలను ఆమె ఒక్కొక్కటిగా పటాపంచలు చేస్తున్నారు. రాజకీయాలు చేయాలంటే ధైర్యం ఉండాలని చెప్పి చూపిస్తున్నారు.
పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం సరైన నిర్ణయమే. అవసరమే. తాను కాలక్షేపానికి రాజకీయాలు చేయడం లేదని, ఎన్నికలలో పోటీ చేస్తామని, గెలిస్తే అధికారం చేపడతామని స్పష్టంగా చెప్పడం ద్వారా ఆమె ఇతర పార్టీలలో సీనియర్లను ఆకర్షించడానికి చాలా స్పష్టమైన సంకేతం పంపారు.
కానీ ఇదొక్కటే సరిపోదు. తన వెంట గుప్పెడు మంది అనామకులున్నా చాలు వారితో కలిసి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయగలనని నిరూపించుకుంటున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పుడు ఇలాగే ముందుకు సాగారు. నాడు ఆయనను ఎద్దేవా చేసిన కవిత నేడు అదే మార్గంలో నడుస్తున్నారు. అవమానాలు, విమర్శలు, ఒంటరితనం అన్నీ భరించగలిగితేనే గమ్యం చేరగలమని ఆయన నిరూపించి చూపారు. ఇప్పుడు ఆమె ట్రై చేస్తున్నారు.
పార్టీ అధికారికంగా ప్రకటించే వరకు జాగృతి జెండాలు, కండువాలతో పోరాటాలు కొనసాగించడం వ్యూహాత్మకంగా మంచిదే. సంస్థాగత నిర్మాణం లేనప్పుడు ఓ ఉద్యమ వేదిక అవసరం. జాగృతిని అందుకు ఉపయోగించుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.5,000 కోట్లతో హైదరాబాద్‌లో ప్రపంచంలోకెల్లా ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, దాని కోసం భూసేకరణ, ఇళ్ళ కూల్చివేత… ఇవన్నీ రాజకీయ అవకాశాలే. వాటిని సకాలంలో గుర్తించడం, సరిగ్గా వినియోగించడం కూడా అవసరమే. కవిత అదే చేస్తున్నారు.
మూసీ బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశాన్ని హైలైట్ చేస్తూ పేదల ఇళ్ళు ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నించడం ద్వారా ఆమె రాజకీయ చతురతకి ఓ చిన్న నిదర్శనం.
ధర్నా చేయడం, పోలీసుల అరెస్ట్ ప్రయత్నం, ఆమె ఎదురుతిరగడం, మీడియా ముందు మాట్లాడడం, సోషల్ మీడియాలో ప్రచారం, ఇవన్నీ ‘స్టాండర్డ్ రాజకీయ ఫార్మాట్’లో ఉన్నవే. రాజకీయాలలో ఉన్నవారు ఇదే ఫార్మాట్ ఫాలో అవుతుంటారు. కనుక కవిత సరైన దిశలోనే అడుగులు వేస్తున్నరనుకోవచ్చు.
కానీ ఇది చాలా లాంగ్ జర్నీ ఈ ‘జర్నీ ఖర్చులు’ చాలా భారీగా ఉంటాయి. ఆమె పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారంటే దానర్ధం ఆమెకు అంత ఆర్థిక స్తోమత ఉందనే.
ఒకప్పుడు గులాబీ కారుకి జాగృతి స్టెఫీనీగా ఉన్నది. ఇప్పుడు అదే ఆమెకు ఉపయోగపడుతోంది. బీఆర్ఎస్ నుంచి ఓ నలుగురు సీనియర్లు రప్పించగలిగితేనే స్టెఫీనీకి వెహికల్ అమర్చినట్టవుతుంది.
తెలంగాణ సీఎం అవ్వాలనే రూట్ మ్యాప్ ఆమె వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉంది. కనుక ఆ తర్వాత అసలు ప్రయాణం మొదలవుతుంది. ఆమె ఎంత దూరం ప్రయాణించగలరో? ఈ ప్రయాణంలో ఆమెతో కలిసి వచ్చేవారెవరో? అందరూ కలిసి గమ్యానికి చేరుకోగలరో లేదో? రాబోయే రోజుల్లో చూస్తాము.
Dasara is turning into another Sankranti of sorts at the Telugu box office, with several…
Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…