దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కమల్ స్వీయ దర్శకత్వ సినిమా “విశ్వరూపం” మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2013లో విడుదలైన ఈ సినిమా క్లైమాక్స్ లో రెండవ పార్ట్ ప్రకటించి మరింత ఆసక్తిని రేకెత్తించారు కమల్. అయితే అప్పటినుండి ఇప్పటివరకు దాదాపుగా మూడేళ్ళు కావస్తున్నా సినిమా విడుదల కాలేదు. మధ్యమధ్యలో పోస్టర్లు సందడి చేసినా… అవి కేవలం ప్రచార చిత్రలుగానే మిగిలిపోయాయి. ఎప్పటికప్పుడు ఇదిగో విడుదల అని కమల్ ప్రకటించడం, మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం.
అయితే చాలా కాలం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ‘విశ్వరూపం 2’ సినిమా. మొదటి పార్ట్ కు నిర్మాత అయిన ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన “ఐ” వంటి సినిమాలు విఫలమైన నేపధ్యంలో, ఆర్ధిక ఇబ్బందుల రీత్యా రెండవ పార్ట్ ను పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోయారని, ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించిన కమల్ కు తాజాగా ఓ విదేశీ సంస్థ ముందుకొచ్చిందని, మిగతా షూటింగ్ ను పూర్తి చేసి, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కమల్ పట్టుదలతో ఉన్నారని కోలీవుడ్ వర్గాల్లో లభిస్తున్న సమాచారం.
అన్నీ సజావుగా జరిగితే ఈ ఏడాది చివర్లో “విశ్వరూపం 2” విడుదల కావచ్చన్నది ఈ కధనాల సారాంశం. మొదటి పార్ట్ ను వీక్షించిన ప్రేక్షకులు ఈ రెండవ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టెర్రరిజం నేపధ్యంలో సాగిన ఈ సినిమాను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సృష్టించిన అడ్డంకులు అందరికీ తెలిసినవే. ఈ ఉదంతాలతో దేశం వీడిపోతానని కమల్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారి తీసిన వైనం కూడా మరిచిపోలేని సంఘటన.





