పీక మీద కత్తి పెట్టి పనులు చేయించుకుందామంటే రాజకీయాల్లో కుదరదు. ఇది జగమెరిగిన సత్యమే. కానీ, ఇటీవల కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆ రోజు సాయంత్రానికల్లా ప్రకటన చేయాలని, పేపర్లు జారీ చేయాలని ముద్రగడ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల రీత్యా ఈ నెల 5వ తేదీ వరకు వేచిచూస్తానని లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, కాపు జాతి మొత్తం తన వెంటే నడుస్తుందని, తన మాట జవదాటదని ముద్రగడ చెప్పిన సంగతులు తెలిసిందే.
ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడును కలిసిన కాపు సంఘాల నేతలు తామూ, 9 నెలల పాటు వేచిచూసే ధోరణితో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాపు కమిషన్ తన నివేదికను సమర్పించేందుకు 9 నెలల సమయం పడుతుందని గనుక, ఆ నివేదిక కోసం తొమ్మిది నెలలు ఎదురు చూడాలనుకుంటున్నామని, ఆ నివేదిక వచ్చిన తరువాత కూడా సర్కారు స్పందించకపోతే ఉద్యమిస్తామని అన్నారు. దీంతో తాత్కాలికంగా కాపు ఉద్యమానికి శుభంకార్డు పడినట్లయ్యింది.





