Telugu

‘బోధన్’ కవిత కు కొత్త రాజకీయ పాఠాలు బోధిస్తుందా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత మరోసారి తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ‘బోధన్’ నుంచి పోటీ చేస్తానంటూ ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

అయితే గతంలో ‘సిద్దిపేట’ను తన తొలి ప్రాధాన్యంగా, బోధన్‌ను మరో ప్రత్యామ్నాయంగా ప్రకటించిన కవిత.. ఇప్పుడు బోధన్ వైపు మొగ్గు చూపడం వెనుకున్న రాజకీయ వ్యూహం ఏమిటన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి సిద్దిపేట, బోధన్.. ఈ రెండు నియోజకవర్గాల ఎంపిక వెనుక వేర్వేరు రాజకీయ సమీకరణాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల భావన.

ADVERTISEMENT

సిద్దిపేట ప్రస్తుతం బిఆర్ఎస్ ముఖ్యనేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడి నుంచి పోటీ చేయాలనే కవిత ఆలోచనను బీఆర్ఎస్‌లోని కుటుంబ, రాజకీయ ఆధిపత్యంపై సవాలుగా కూడా రాజకీయ విశ్లేషకులు చూశారు.

ముఖ్యంగా హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత గతంలో చేసిన విమర్శల నేపథ్యంలో సిద్దిపేట ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు బోధన్ ఎంపిక వెనుక కవితకు ఉన్న పాత రాజకీయ అనుబంధాన్ని విస్మరించలేం. నిజామాబాద్ జిల్లా ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలకమైన పాత్ర పోషించిందనే చెప్పాలి.

2014లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కవిత, 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. దీంతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, స్థానిక నాయకత్వం, ప్రజా సమస్యలపై ఆమెకు గత అనుభవం ఉంది.

అయితే నిజామాబాద్ లోక్‌సభ స్థానం, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం వేరు.. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం వేరు. అయినప్పటికీ జిల్లాతో తనకున్న ఉన్న పాత అనుబంధం బోధన్‌ను ఆమెకు రాజకీయంగా పరిచయమైన వేదికగా మార్చవచ్చు. సిద్దిపేటలో పోటీ చేస్తే హరీశ్ రావుతో ప్రత్యక్ష రాజకీయ పోరుకు తెరలేపినట్లవుతుంది.

అదే బోధన్‌ను ఎంచుకుంటే తనకు గతంలో రాజకీయంగా పట్టున్న నిజామాబాద్ జిల్లాలో మళ్లీ పట్టు సాధించే ప్రయత్నంగా చూడవచ్చు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కవిత తన రాజకీయ అజెండాలో రైతుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

బోధన్ ప్రాంతంలో వ్యవసాయం, చెరకు రైతుల సమస్యలు, చక్కెర కర్మాగారం, సాగునీరు, ఉపాధి వంటి అంశాలు కీలకం. వీటిపై ఆమె ఎలాంటి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో కూడా కవిత పసుపు రైతుల కోసం బిఆర్ఎస్ ఎంపీ గా పార్లమెంట్ లో తన గళం వినిపించారు.

అయితే కేవలం పాత రాజకీయ అనుబంధం మాత్రమే ఎన్నికల్లో ప్రజల మద్దతును తీసుకొస్తుందని భావించలేం. కొత్త పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి నాయకత్వం, స్థానిక సమస్యలపై పోరాటం, ప్రజలతో నిరంతర సంబంధాలు ఆమెకు కీలకం కానున్నాయి. ముఖ్యంగా గతంలో నిజామాబాద్‌లో ఎదురైన ఎన్నికల అనుభవం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్తారన్నది చూడాలి.

మొత్తానికి సిద్దిపేట కవితకు కుటుంబ రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించే వేదిక అయితే.. బోధన్ గత రాజకీయ అనుబంధాన్ని తిరిగి బలోపేతం చేసుకునే అవకాశం. ఈ రెండింటి మధ్య బోధన్ వైపు ఆమె అడుగులు వేయడం వెనుక ఉన్న వ్యూహం భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరి బోధన్ ప్రజల నుంచి కవితకు ఎలాంటి స్పందన లభిస్తుంది? ఆమె రాజకీయ ప్రస్థానానికి ‘బోధన్’ నియోజకవర్గం ఎటువంటి ‘బోధనలు’ నేర్పనుంది అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Was Yuvraj Singh the Secret Behind Vaibhav’s Rise?

Vaibhav Sooryavanshi was struggling for runs in the Rising Stars Asia Cup after failing to…

28 minutes ago

ఆంధ్రాకు వరుస తుఫానులు… ఈ నీటిని పొదుపు చేసుకోగలిగితే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరుస తుఫానులు పెద్ద సమస్యగా మారాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి…

41 minutes ago