
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ముందుగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సంకటమే వచ్చి పడింది.
కేటీఆర్ ఎంత ఆచితూచి ట్వీట్ చేసినా ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఈ కేసే కారణమన్నట్లు వ్రాసిన ఒక చిన్న లైన్ పట్టుకొని కవిత నిప్పులు చెరిగారు.
‘రాజకీయాలు చేయాలంటే నాలాగ ధైర్యం ఉండాలి. అది లేని నీకు రాజకీయాలు ఎందుకు? అని ప్రశ్నించారు.
ఇంతకాలం బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్ధులు, మీడియా కేసీఆర్, కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, వారి అహంకారమే పార్టీ ఓటమికి కారణమని విమర్శిస్తుండేవారు.
కానీ అప్పుడు ఒక్కొక్కరిపై ఒక్కోరకం ముద్రవేసి వారందరూ అసూయ, ద్వేషంతోనే తమ గురించి ఆవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సర్ది చెప్పుకునేది.
కానీ ఇప్పుడు కేసీఆర్ సొంత కూతురు కల్వకుంట్ల కవిత, “మీ అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది,” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
“ఈ నిజాన్ని, వైఫల్యాలను కూడా ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. మీ కంటే ధైర్యంగా కొత్త పార్టీ పెట్టుకొని ఒంటరి పోరాటం చేస్తున్న నేనే బెటర్,” అని కవిత ఎద్దేవా చేయడం, కేటీఆర్ అహాన్ని మరోసారి దెబ్బతీసి ఉండొచ్చు.
కానీ కవిత ఆక్షేపించినట్లే, ఆమె విమర్శలకు, ఆరోపణలకు జవాబు చెప్పే ధైర్యం కూడా లేకుండా పోయింది కేటీఆర్‌కి. వెంటనే ఫామ్‌హౌసులో తండ్రి వద్దకు పరిగెత్తారు!
అంటే తన గురించి ప్రత్యర్ధులు, మీడియా, కవిత చెప్పిన ప్రతీ మాట నిజమేనని కేటీఆర్ వెంటనే నిరూపించుకున్నట్లే కదా?
కవిత కొత్త పార్టీ పెడుతున్నానని చెపుతూనే కేటీఆర్‌కి ధైర్యం, నాయకత్వ లక్షణాలు లేవని డంఖా బజాయించి చెప్పడం అంటే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అందరూ వచ్చేయమని చెపుతున్నట్లే!
గతంలో కేసీఆర్ కాంగ్రెస్, టీడీపి నాయకులను ఎత్తుకుపోయి వాటిని నిర్వీర్యం చేశారు. ఏపీలో జగన్ కాంగ్రెస్ నాయకులను ఎత్తుకుపోయి ఆ పార్టీని తుడిచిపెట్టేశారు.
ఇప్పుడు కవిత కూడా అదే చేయబోతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు కాగానే ఆమె ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచే నాయకులను ఎత్తుకుపోవడం ఖాయం. కవిత చెప్పిన మాటలతో బీఆర్ఎస్ నేతలలో ఆలోచన మొదలవకుండా ఉంటుందా?ఉంటే గ్యారేజీలో ఉన్న కారు దిగిపోకుండా ఉంటారా?
బీఆర్ఎస్ పార్టీకి ఇదొక్కటే సమస్య కాదు… మరోపక్క సిఎం రేవంత్ రెడ్డి బహుమతిగా ఇచ్చిన కేసులు ఉండనే ఉన్నాయి.
బిజేపిలో విలీనమయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో సిద్ధపడిందని స్వయంగా కవితే చెప్పారు కదా? కనుక తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తేవడానికి, బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే సమయం వచ్చిందని, బిజేపి పెద్దలు అనుకుంటే ఈ కేసులు జైలు గేట్లను బార్లా తెరుస్తాయి.
కనుక ఈ ‘మిషన్ బీఆర్ఎస్ డిమాలిషన్’లో భాగంగానే కవితని బిజేపి బాణంగా ఉపయోగిస్తోందేమో? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్ళలోనే బీటలు వారినట్లు, కేసీఆర్ నిర్మించుకున్న బీఆర్ఎస్ కంచుకోటకి కూడా పగుళ్ళు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
కనుక ఎంకి పెళ్ళి సుబ్బి చావుకే వచ్చినట్లే… పక్కా!
Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…