కేసులు ముఖ్యం కాదు… టైమింగ్, ప్లానింగే చాలా ముఖ్యం!

Kavitha Kalvakuntla Arrested

కేసులన్నీ అధికార పార్టీలకు పాండవులు జమ్మిచెట్టుపై దాచిన అస్త్రశస్త్రాలవంటివే అని ఇదివరకే చెప్పుకున్నాము. కనుక ఆ కేసులలో నిందితులకు శిక్ష పడిన దాఖలాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అధికారంలో ఉన్న మన రాజకీయ పార్టీలు వాటిని అవసరమైనప్పుడు శత్రువులపై ప్రయోగించడానికే ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఇందుకు తాజా నిదర్శనంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితని అరెస్ట్.

ADVERTISEMENT

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమెను అరెస్ట్ చేయాలనే ‘టైమింగ్’ వెనుక మంచి ‘ప్లానింగ్’ కూడా కనబడుతోంది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆమెను అరెస్ట్ చేసి ఉండి ఉంటే, అప్పుడు ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. బిఆర్ఎస్ పార్టీ పట్ల కూడా ప్రజలలో మంచి అభిప్రాయం ఉండేది. కనుక బిఆర్ఎస్ ఎదురుదాడి మామూలుగా ఉండదు. దాని వలన బీజేపీ నష్టపోతే బిఆర్ఎస్ పార్టీకి రాజకీయ మైలేజి లభించి మరింత బలపడి ఉండేది.

ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్‌ కూడా చాలా బలహీనంగా ఉన్నారు. ఓ పక్క బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంటే, మరో పక్క లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి.

మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ కేసులో కల్వకుంట్ల కవిత తనంతట తానే విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వమే కల్పించిందని చెప్పవచ్చు. తద్వారా ఆమె ఈ నేరం చేసింది కనుకనే విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే భావన ప్రజలకు కలిగేలా చేశారు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. కనుక కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడానికి ఇప్పుడే సరైన సమయం అని కేంద్ర ప్రభుత్వం భావించి ఉండవచ్చు.

ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తే, కేసీఆర్‌ ఆమెనే కాపాడుకుంటారా లేదా ఖాళీ అయిపోతున్న పార్టీనే కాపాడుకుంటారా లేదా లోక్‌సభ ఎన్నికలలో అభ్యర్ధులనే గెలిపించుకుంటారా?అని ఆలోచిస్తే కల్వకుంట్ల కవిత అరెస్ట్ వెనుక చాలా గొప్ప టైమింగ్, చాలా పెద్ద ప్లానింగ్ ఉందని అర్దమవుతుంది.

ఇదే ఫార్ములా ఏపీలో అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసుకి కూడా అన్వయించి చూస్తే, కేంద్ర ప్రభుత్వం వాటిలో కూడా ఇదేవిదంగా వైసీపి గాలిపటానికి దారం వదులుతోందని భావించవచ్చు. కనుక ఏదో రోజు దారం తెంచేస్తే వైసీపి గాలిపటాలు ఎక్కడ పడతాయో ఊహించుకోవచ్చు.

మళ్ళీ కేసీఆర్‌ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవలసి ఉంది. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవడం కోసమే బీఎస్పీతో పొత్తులు పెట్టుకున్నామని కేసీఆర్‌ నిన్ననే చెప్పారు. కనుక వాటి కోసం కేసీఆర్‌ మళ్ళీ మోడీతో యుద్ధం మొదలుపెడతారా లేక కూతురు కోసం, పార్టీ కోసం రాజీ పడతారా?త్వరలోనే అందరూ చూడొచ్చు.

ADVERTISEMENT
Latest Stories