
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సస్పెండ్ అయిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి పార్టీలో సీనియర్ నేత హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయనే తన తండ్రికి నమ్మకం ద్రోహం చేస్తూ పార్టీని ముంచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆయనతో జాగ్రత్తగా ఉండమని ఆమె తండ్రిని హెచ్చరించారు.
ఆమె చేసిన ఈ ఆరోపణ వ్యక్తిగతంగా, రాజకీయంగా హరీష్ రావుకి, బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా నష్టం కలుగజేసేవే. పార్టీ విశ్వసనీయతని దెబ్బ తీసేవే. కనుక హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ పార్టీ తరపున ఆమెకు చాలా ధీటుగా బదులిస్తారని అందరూ భావించడం సహజం.
కానీ హరీష్ రావు “నా జీవితం తెరిచిన పుస్తకం వంటిది. ఆ ఆరోపణలు ఆమె విజ్ఞతకే విడిచిపెడుతున్నానంటూ ‘స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ’లా చాలా క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా పార్టీ తరపున ఆమె ఆరోపణలను ఖండిస్తారనుకుంటే మౌనంగా ఉండిపోయారు.
బీఆర్ఎస్ మౌనం చాలా ఆశ్చర్యకరమే. ఆమెపై ప్రతి విమర్శలు చేస్తే మరింత రచ్చరచ్చ అవుతుందని కావచ్చు లేదా ఆమెపై ఎదురుదాడి చేస్తే ఆమెకు సానుభూతి, తమ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని కావచ్చు లేదా ఆమె కేసీఆర్ కూతురు కావడం కారణం అయ్యుండవచ్చు.
హరీష్ రావు మాటలను బట్టి ఆమె రాజకీయ దురుదేశ్యంతోనే ఈవిదంగా మాట్లాడుతున్నారని చెపుతున్నట్లుంది. ఒకవేళ హరీష్ రావు చెప్పుకున్నట్లు ఆయన ఎటువంటి కుట్రలు చేయకపోతే మరి కవిత ఆయనపై ఇటువంటి తీవ్ర ఆరోపణలు ఎందుకు చేసినట్లు?
కేసీఆర్ నేటికీ హరీష్ రావునే నమ్ముతున్నారు. కనుక తన తండ్రి కేసీఆర్ తనని పట్టించుకోకుండా హరీష్ రావుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అసూయతో కవిత ఆయనని టార్గెట్ చేసుకున్నారా? లేక పార్టీలో, ప్రభుత్వంలో తనకు పదవులు, ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో రగిలిపోతూ ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…