
కల్వకుంట్ల కవిత రాజీనామాని మండలి చైర్మన్ నిన్న ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా పొందిన ఆ పదవిని వదులుకోవడం నైతికంగా సరైనదే. కానీ రాజకీయంగా తప్పిదమే అవుతుంది. 2028లో జరిగే ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తేనే ఆమె మళ్ళీ శాసనసభలోఅడుగు పెట్టగలుగుతారు. అంతవరకు లోనికి ప్రవేశం లభించదు.
ఆమె బయట ఎన్ని మాట్లాడినప్పటికీ శాసన మండలిలో మాట్లాడిన మాటలకు విలువ ఎక్కువుంటుంది. ఉదాహరణకు ఇంతకాలం ఆమె ఎన్ని తీవ్ర ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోని బీఆర్ఎస్ పార్టీ, మొన్న ఆమె మండలిలో ఆరోపణలు చేయగానే వెంటనే ఘాటుగా స్పందించింది.
అలాగే ప్రజా సమస్యలపై ఆమె బయట ఎన్ని మాట్లాడినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు. కానీ మండలిలో నిలదీస్తే తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆమె ఎమ్మెల్సీగా కొనసాగి ఉంటే ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. కానీ ఆమె ఈ అవకాశాలన్నిటినీ వదులుకున్నారు. కనుక ఇప్పుడు ఆమె కేవలం ఓ రాజకీయ నాయకురాలు మాత్రమే.
ఆమె రాజీనామా ఆమోదింపజేసుకోవడం ద్వారా తాను నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రజలకు మంచి సంకేతమే పంపారు. కానీ ఆమె ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో ఆరు నెలలు తీహార్ జైల్లో గడిపారు. అది కాక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అమ్ముకున్నారని, ఆమె భర్త భూములు కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
మున్ముందు బీఆర్ఎస్ పార్టీతో యుద్ధం తీవ్రమైతే మరిన్ని తీవ్రమైన ఆరోపణలు వినిపించే అవకాశం ఉంది. కనుక ఆమె రాజీనామాతో కొత్తగా ‘క్లీన్ ఇమేజ్’ ఏమీ రాదనే చెప్పాలి.
ఏది ఏమైనప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసం లేదా అతివిశ్వాసంతో పదవికి రాజీనామా చేసి ఒంటరి రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. త్వరలోనే ఆమె సొంత పార్టీ పెట్టుకోబోతున్నారు. కనుక ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఏవిధంగా సాగుతాయో, ఏ గమ్యం చేరుతారో కాలమే చెపుతుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…