రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల మద్య భావ సారూప్యత ఉంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీల మద్య ఉన్నా అర్థం చేసుకోవచ్చు.
కానీ అధికార, ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా వస్తున్న పార్టీల మద్య కూడా సారూప్యత ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చిన కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. ప్రతీ సభలో తనకు అన్యాయం జరిగిందని వాపోతుంటారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటారు.
తాను ఆ గులాబీ అవినీతి బురదలో నుంచి పుట్టిన తామర పువ్వు వంటిదానినని, కానీ తనకు ఆ బురద అంటుకోలేదని ప్రజలకు నచ్చజెపుతుంటారు.
నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పాలనలో బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగలేదని, కనుక తాను వారిని ఉద్దరించడానికే పార్టీ స్థాపించానని చెప్పుకుంటారు.
కనుక తనని నమ్మి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని, ప్రజలను అమ్మలా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చెప్తున్నారు.
వైసీపీలో నుంచి బయటపడిన విజయసాయి రెడ్డి విజయ దశమికి కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారు. అయన మాట్లాడే ప్రతీ మాట కూడా అచ్చం ఆమె మాటల్లాగే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
“వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు జగన్ నన్ను వాడుకున్నారు. తర్వాత కూరలో కరివేపాకులా పక్కన పడేశారు. నేను జగన్ కోసం ఢిల్లీలో పైరవీలు చేసిన మాట వాస్తవం. కానీ రాష్ట్రంలో జరిగిన (మద్యం కుంభకోణం) పరిణామాలకు, నాడు జగన్ హయంలో సీఎంవోలో తీసుకున్న నిర్ణయాలకు ఎటువంటి సంబంధమూ లేదు.
టీడీపి, వైసీపీల పాలనలో వారి కులం, మతం వారికి తప్ప వేరెవరికీ అవకాశం లభించ(లే)దు. కనుక రాష్ట్రంలో మిగిలిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే నేను ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. నాతో అందరూ కలిసి రావాలని కోరుతున్నాను,” అని విజయసాయి రెడ్డి నేడు విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.
కవిత, విజయసాయి మద్య ఒకే ఒక్క పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది. ఆమె ముఖ్యమంత్రి పదవి చేపడతానని చెపుతుంటే, విజయసాయి నేను చేపట్టను వేరే కులం వారికి ఆ సీటు రిజర్వ్ చేశానని చెప్తున్నారు. మిగిలినదంతా సేమ్ టూ సేమ్.
కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం సుమారు ఆర్నెల్లు తిహార్ జైలుకి వెళ్ళి వస్తే, విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులలో చంచల్ గూడా జైలుకి వెళ్ళి వచ్చారు.
ఇద్దరూ అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన పార్టీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలలో దీర్గాకాలం పని చేశారు. కానీ వాటి అవినీతితో తమకు సంబంధం లేదు నమ్మమంటున్నారు.
ఇద్దరూ కోట్లకు పడగలెత్తిన ధనవంతులే కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఆరాటపడుతున్నామని చెపుతున్నారు.
ఇద్దరూ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం ఉందని కనుకనే తాము పార్టీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇద్దరూ అధికార, విపక్షాలను విమర్శిస్తూ తమకీ ఓ ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
అంతేకాదు.. ఇద్దరూ ఎవరు విడిచిన బాణం?అనే కామన్ ప్రశ్న కూడా ఎదుర్కోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు రాష్ట్రాలలో రెండు కొత్త పార్టీల మద్య కూడా ఇంత సారూప్యత ఉండటం ఆశ్చర్యకరమే కదా? ఇదెలా సాధ్యం?







