కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి కేంద్ర మంత్రి పదవిని సైతం అధిష్టించి, ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో బిజెపిలో చేరిన సీనియర్ నేత మరియు ప్రముఖ వ్యాపారవేత్త కావూరి సాంబశివరావు బ్యాంకులకు భారీగా బకాయి పడ్డ విషయం ఇటీవల వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
కావూరి నేతృత్వంలోని ‘ప్రొగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్’ వాణిజ్య పన్నుల శాఖకు కూడా 12 కోట్ల మేర పన్ను బకాయి పడింది. ఈ నేపథ్యంలో సదరు బకాయి పన్నును వసూలు చేసేందుకు రంగంలోకి దిగిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, హైదరాబాదులోని ఖైరతాబాదు ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ లో కావూరి పేరిట ఉన్న 1,160 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఓ పురాతన భవనం ఉన్న ఆ స్థలాన్ని బహిరంగంగా వేలం వేసేందుకు సదరు శాఖ కోర్టు అనుమతి తీసుకుంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన వేలానికి ఏ ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాలేదట.
ప్రస్తుతం అక్కడ గజం విలువ బహిరంగ మార్కెట్ లో 35-40 వేలు ఉండగా, వాణిజ్య పన్నుల శాఖ మాత్రం గజం విలువను ఏకంగా లక్ష రూపాయలుగా నిర్ధారించింది. ఈ కారణంగానే బిడ్డర్లు ఎవరూ రాలేదట. ప్రారంభ ధర మరీ ఎక్కువగా ఉందని చెప్పిన బిడ్డర్లు ధరను తగ్గిస్తే కొనేందుకు సిద్ధమని కూడా ఆ శాఖకు విన్నివించారు. ఈ నేపథ్యంలో కావూరి స్థలం వేలానికి మరోమారు ప్రకటన జారీ చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్పారు.





