నగర మేయర్ పీఠమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఓటింగ్ లో పాల్గొనరనే అపవాదు ఉందని, దీనిని తొలగించే విధంగా ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించాలని ఆయన కోరారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయడానికి కోతల్లేని విద్యుత్ ఒక్కటి చాలని, రెప్పపాటు సమయం కూడా విద్యుత్ పోకుండా చర్యలు తీసుకుంటున్నామని, జంట నగరాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని నీటి సమస్యను తీర్చలేకపోతే… “వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని,” ట్విన్ సిటీస్ లో కేవలం 7 రైతు బజార్లున్నాయని ఇది సిగ్గుచేటని, త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో జంట నగరాల్లో 200 రైతు బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో భూకబ్జాలు, అక్రమాలు జరిగాయన్నారు. ఇప్పుడవే పార్టీలు ఓట్లు అడగడానికి వచ్చాయని ఎద్దేవా చేశారు. ఆస్పత్రులకు వచ్చే వారి కోసం నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ కు రెండు వైపులా రెండు కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే టీఆర్ఎస్ ఉద్దేశ్యమన్నారు. నగరంలో మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్ లో ఉండే వాళ్లంతా మా వాళ్లేనని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ సహా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా అందిస్తామన్నారు.
కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం గ్రేటర్ పరిధిలోని ప్రజలకు తనపై, ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చేయడమే లక్ష్యంగా సాగింది. విభజన తర్వాత ‘సెటిలర్లు’ అని ప్రసంగించిన కేసీఆర్ ప్రస్తుతం మాత్రం నగరంలో ఉన్న వారంతా ‘మా’ వారే అని చెప్పి, వారందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పధకాలు వర్తిస్తాయని చెప్పి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసారు. అయితే టీఆర్ఎస్ అధినేతతో సహా ఆ పార్టీ నాయకులు ప్రదర్శిస్తున్న ఊపు ప్రత్యర్థి పార్టీలకు ఆందోళనకరంగానే మారింది.





