Telugu

కూతురు చెప్తున్నా కేసీఆర్‌ రావడం లేదే!

మూడు రోజుల విరామం తర్వాత నేటి నుంచి మళ్ళీ తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. మొదటి రోజు హాజరు కోసం వచ్చిన కేసీఆర్‌ ఎప్పటిలాగే మళ్ళీ మొహం చాటేశారు. శాసనసభకు వస్తే తాము అవమానిస్తామని కేసీఆర్‌ భయపడవద్దని, వస్తే అయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా కేసీఆర్‌ రాలేదు.

ఈరోజు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత మండలికి వచ్చారు. తన రాజీనామాని ఆమోదింపజేసుకోవడానికే వచ్చానన్నారు. ఆమె కూడా తండ్రి కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT

కీలకమైన నదీ జలాల చర్చని పిల్ల కాకులు (కేటీఆర్‌, హరీష్‌ రావు)లపై వదిలేయవద్దన్నారు. వారు కేవలం ‘బబూల్ షూటర్స్’ మాత్రమేనన్నారు. కేసీఆర్‌ శాసనసభకు రాకుంటే బీఆర్ఎస్‌ పార్టీ మనుగడ కష్టమన్నారు.

చివరికి కన్న కూతురు కూడా కేసీఆర్‌ని ఆక్షేపిస్తున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తప్పు పడుతున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేస్తానంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ ఎప్పటిలాగే శాసనసభకు మొహం చాటేస్తున్నారు.

ఇంతకీ కేసీఆర్‌ శాసనసభకు రాకపోవడానికి కారణం ఏమిటి? తాను అమితంగా ద్వేషించే రేవంత్ రెడ్డి సిఎం హోదాలో మాట్లాడుతుంటే, ఆయన ముందు ప్రతిపక్ష నేతగా నిలబడటం ఇష్టం లేకనా? సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తన స్థాయికి తగిన నేతలు కారనా?

సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తనని సభలో అవమానిస్తారనా? లేదా మునుపటిలా ఆరోగ్యం సహకరించడం లేదు కనుక శాసనసభలో అంతసేపు నిలబడి తన వాదనలు వినిపించలేననా?

ఏది ఏమైనప్పటికీ కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు ఎందుకు రావడం లేదో కారణం చెప్పి ఉంటే హుందాగా ఉండేది. కానీ చెప్పకుండా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తుండటం ఆయన బలహీనతకు అద్దం పడుతోంది.

కేసీఆర్‌కి డబ్బుకు కరువులేదు. కానీ శాసనసభకు రాకపోయినా జీతభత్యాల కోసం వచ్చి సంతకం చేసి వెళుతున్నారు. జీతభత్యాలు వద్దని చెప్పవచ్చు కదా? ఒకవేళ జీతభత్యాలు తీసుకోకపోతే నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడుతుందంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు కదా?

ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలకు బీఆర్ఎస్‌ పార్టీ డిమాండ్ చేస్తున్నప్పుడు, శాసనసభకు రానందుకు కేసీఆర్‌ కూడా రాజీనామా చేయాలి కదా?

పార్టీ శ్రేణులకు ఆయన నాయకత్వంపై నమ్మకం పోతుంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తుంటాయి. కనుక ఆర్నెల్లకో ఏడాదికో ఓసారి బయటకు వచ్చి ఆయన చెప్పే మాటలను వారు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. అంతిమంగా కల్వకుంట్ల కవిత చెప్పినట్లు బీఆర్ఎస్‌ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After Bloody Romeo, Nani Wants a Clean Break

Nani seems ready to move away from the A-certificate zone, but he is not doing…

14 minutes ago

కనబడుట లేదు: 45 ఎకరాలు

ఫలానా అబ్బాయి లేదా అమ్మాయి కనిపించుట లేదు. మా పెంపుడు కుక్క కనిపించుట లేదు.. వంటి వార్తలు తరచూ చూస్తూనే…

36 minutes ago