ఒక్క ఓటమితోనే కారు ఖాళీ అయిపోతోందే!

దేశంలో చాలా రాజకీయపార్టీలు ఎన్నికలలో గెలుస్తుంటాయి… ఓడిపోతుంటాయి. కానీ ఓడిపోగానే ఏ పార్టీ మూతపడిపోదు. ధైర్యం కోల్పోదు. ఇందుకు చక్కటి ఉదాహరణ కాంగ్రెస్‌, టిడిపి, వైసీపిలే. ఈ మూడు పార్టీలు కూడా ఎన్నో ఒడిదుకులు, ఓటమిని చవిచూసినవే.

ముఖ్యంగా ఒకానొక సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దుస్థితికి చేరుకోగా, ఏపీలో టిడిపి గత 5 ఏళ్ళుగా ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోందో అందరూ చూస్తూనే ఉన్నారు. వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసులలో 16 నెలలు చంచల్‌గూడా జైలులో ఉన్నప్పుడు, ఆ పార్టీ కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది.

ADVERTISEMENT

ఈ మూడే కాదు దేశంలో ఇంకా చాలా పార్టీలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అయినా తమ మనుగడ కాపాడుకొంటూ ధైర్యంగా పోరాడుతూ అధికారంలోకి రాగలుగుతున్నాయి.

కానీ తెలంగాణ రాజకీయాలను గత రెండున్నర దశాబ్ధాలుగా శాశిస్తున్న కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క ఓటమితో ప్రస్తుతం దయనీయ స్థితికి చేరుకోవడం, అయినా కేసీఆర్‌ చొరవ తీసుకొని పార్టీ మనుగడ కాపాడుకునే ప్రయత్నాలు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

శస్త్ర చికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ‘డౌన్’ అవడం వలన ఆయన పూర్తి సమయం పార్టీకి కేటాయించలేకపోతున్నారని సర్ధి చెప్పుకున్నప్పటికీ, పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు వరుసపెట్టి కాంగ్రెస్‌, బీజేపీలలోకి వెళ్ళిపోతున్నా కాపాడుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

శనివారం బీజేపీ ప్రకటించిన తెలంగాణ లోక్‌సభ అభ్యర్ధులలో ముగ్గురు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలోకి మారినవారే. మరో ఇద్దరు ముగ్గురు ఎంపీలు, ఓ 10 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌, బీజేపీలో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకా మరో 8 స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించలేదు. వాటిలో మూడు బిఆర్ఎస్‌ నుంచి వచ్చే నేతల కోసమే అని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి!

మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు తెర చాటున గట్టి ప్రయత్నాలే చేస్తోంది. వరంగల్‌ నగరంలో 15 మంది, పెద్దపల్లి, రామగుండంలో మరో 20 మంది బిఆర్ఎస్‌ కార్పొరేటర్లతో కాంగ్రెస్‌ నేతలు మంతనాలు చేస్తున్నారు. నేడో రేపో వారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారు. వారిలో రామగుండం మేయర్ (బిఆర్ఎస్‌) మక్కన్ సింగ్, పెద్దపల్లి మేయర్ బంగి అనిల్ కుమార్‌ కూడా ఉన్నారు.

మరో ఆరు నెలల్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని, మళ్ళీ బిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని బిఆర్ఎస్‌ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నా ఇంత మంది హడావుడిగా కారు దిగి వెళ్ళిపోతున్నారంటే అర్దం ఏమిటి? కారు గ్యారేజీకి వెళ్ళిందని కేటీఆర్‌ చెప్పుకోవలసి రావడాన్ని ఏమనుకోవాలి?

తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు, బిఆర్ఎస్‌ పార్టీకి ఈవిదంగా ఎందుకు జరుగుతోంది? అని ప్రశ్నించుకుంటే కొన్ని బలమైన కారణాలు కనబడుతున్నాయి.

బిఆర్ఎస్‌ పార్టీ అధికారం కోల్పోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను, అవినీతిని ఇక ఎంత మాత్రం దాచిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. చాలా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అది బలమైన ఆయుధంగా లభించింది. దాంతోనే కేసీఆర్‌ని రాజకీయంగా చావు దెబ్బ తీసేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

బహుశః కేసీఆర్‌ సూచనే మేరకే కేటీఆర్‌, హరీష్ రావులు చాలా తొందరపాటుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పడం మరో పెద్ద తప్పిదమే. దాంతో అప్రమత్తమైన రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్‌ పార్టీని తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ కూడా అదేవిదంగా వ్యవహరించారు కనుక ఇప్పుడు రేవంత్‌ రెడ్డిని తప్పు పట్టలేము.

ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఓడిపోవడం, వెంటనే లోక్‌సభ ఎన్నికలు వస్తుండటంతో తెలంగాణలో బీజేపీకి మళ్ళీ బలపడే అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకొనేందుకు బిఆర్ఎస్‌ ఎంపీలనే ఆకర్షించి వారినే కేసీఆర్‌ మీదకు ప్రయోగిస్తోంది.

కేసీఆర్‌, కేటీఆర్‌ అహంభావం, స్వయంకృతాపరాధాల వల్లనే బిఆర్ఎస్‌ పార్టీకి నేడు ఈ దుస్థితి కలిగిందని చెప్పక తప్పదు. కనుక ఇప్పటికైనా వారు ఆత్మపరిశీలన చేసుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ దానికి కట్టుబడి ఉంటే మళ్ళీ ఏదో ఓ రోజు బిఆర్ఎస్‌కి తప్పకుండా మంచి జరుగుతుంది. కాదని అహంభావంతో విర్రవీగితే నష్టపోయేది వారు వారి పార్టీయే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Virat Kohli Deserved Better? Former India Brutal Verdict!

Virat Kohli’s Test retirement is back in the discussion, but this time, the focus is…

25 minutes ago

AA23: The Rumour Hunt Around Allu Arjun Continues

Rumours around the Allu Arjun-Lokesh Kanagaraj project just refuse to die down. A couple of…

55 minutes ago