
కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత మధ్య నాలుగు స్తంభాలాట జరుగుతుంది. అయితే ఈ కుటుంబంలో జరుగుతున్న ఈ నాలుగు స్తంభాలాటలో దొంగెవరు అంటే ముఖ్యమంత్రి పదవనే చెప్పాలి. ఇది ఎవరి దొరకకుండా అందరిని ఊరిస్తూ ఉసూరుమనిపిస్తుంది.
బిఆర్ఎస్ పార్టీ తరుపున కేసీఆర్ ముఖ్యమంత్రి అనేదానికి ఇక్కడ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ బిఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత ఎవరు అనే విషయంలోనే ఇక్కడ స్తంభాలాట మొదలవుతుంది.
ఇందులో సీనియర్ రాజకీయ నాయకుడిగా నాదే మొదటి స్థానం అంటూ ఒకరు, కేసీఆర్ వారసుడిని నేనే అంటూ మరొకరు, కేసీఆర్ రాజకీయ వారసుడు కొడుకే అవ్వాలా అంటూ మరొకరు ఇలా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం స్తంభాలాట ఆడుతున్నారు.
కేసీఆర్ రాజకీయ వారసుడిగా, బిఆర్ఎస్ భవిష్యత్ అధినేతగా కేటీఆర్ అన్న ఊహను కేసీఆర్ సొంత కుమార్తె, కేటీఆర్ తోబుట్టువు కవితనే అంగీకరించలేకపోతున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలోనూ, బిఆర్ఎస్ ఎదుగుదలలోను కేసీఆర్ తో సరిసమానమైన పాత్ర పోషించిన హరీష్ సైతం కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకుంటారా అనేది జవాబు లేని ప్రశ్నగానే మిగులుతుంది.
ఇక తెలంగాణ లో బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలన్నా, కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ ని తెలంగాణ రాజకీయాలకు అధికారికంగా పరిచయం చెయ్యాలన్నా కేసీఆర్ కి ఈ ముఖ్యమంత్రి పదవి అత్యవసరం అనే చెప్పాలి. తానూ పదవిలో ఉన్నప్పుడే తన పార్టీ నేతలు తన నిర్ణయాన్ని గౌరవిస్తారు అనేది కేసీఆర్ ఆలోచన కావచ్చు.
అయితే బిఆర్ఎస్ లో కేసీఆర్ తరువాత స్థానం కోసం, తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ ఇప్పటి నుంచే పార్టీలో తనకు అడ్డుగా ఉన్నవారిని, తనకు అడ్డుపడుతున్న వారిని అడ్డు తప్పిస్తున్నారని, బిఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ కూడా ఈ వ్యూహంలో భాగమే అనేది తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారంలో ఉంది.
అంటే కేటీఆర్ ప్రస్తుత రాజకీయ వ్యూహాలన్నీ భవిష్యత్ ప్రణాళికల కోసమనే చెప్పాలా.? అందులో భాగంగానే పార్టీ ఓటమి నాటి నుంచి బిఆర్ఎస్ కి అన్ని తానే అయి పార్టీ బాధ్యతలను కేటీఆర్ భుజానకెత్తుకున్నారు అనేది పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న ఒక చర్చ.
ఇక ఇప్పటి వరకు కేసీఆర్ నమ్మిన బంటులా, బిఆర్ఎస్ మూల స్తంభంగా నిలిచిన హరీష్ విషయానికొస్తే, బిఆర్ఎస్ పార్టీలో హరీష్ తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అటు కేసీఆర్ ని ఇటు కేటీఆర్ ని తన రాజకియంతో కట్టిపడేస్తున్నారని,
హరీష్ ని దాటుకుని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ముందుకెళ్ళే పరిస్థితి లేదని, వారి చేతులకు హరీష్ ఎప్పుడో రాజకీయ సంకెళ్లు వేసేశారని ప్రత్యర్థి పార్టీలు హరీష్ ని కట్టప్పగా అభివర్ణిస్తున్నారు. ఈయన అంతిమ లక్ష్యం కూడా ముఖ్యమంత్రి పదవే అనేది వారి ఆరోపణ.
ఇక కేసీఆర్ కుమార్తెగా తెలంగాణ రాజకీయాలకు పరిచయమైన కవిత విషయానికొస్తే ఇన్నాళ్లుగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ గా ఎమ్మెల్సీ గా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన కవిత జాగృతి కార్యక్రమాలతో సందడి చేసారు. అలాగే 2019 ఎన్నికలలో నిజబాబాద్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక 2023 ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు ఆరు నెలలు తీహార్ జైలు జీవితం అనుభవించారు. ఇక ఆతరువాత బైలు మీద బయటకొచ్చిన కవిత రాజకీయ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు సొంత పార్టీలోనే గుర్తింపు కోసం పాకులాడుతూ చివరికి సస్పెన్షన్ వేటుతో బిఆర్ఎస్ కు దూరమయ్యారు.
దానితో తిరిగి జాగృతిని రాజకీయంగా యాక్టీవ్ చేసి ఏదోనాటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కుతా అంటూ భవిష్యత్ రాజకీయాల కోసం కలలు కంటున్నారు కవిత. ఇలా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న ఈ నలుగురు నేతలకు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం అనేది నాలుగు స్తంభాలాటల మారింది. మరి ఆ పదవి ముందుగా ఎవరిని తన దరిచేర్చుకుంటుందో చూడాలి.
Ramayana Part 1 is arriving in a month. The movie has already created buzz with…
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…