Telugu

మేము చేస్తే సంసారం.. ఎదుటవాళ్ళు చేస్తే వ్యభిచారం!

ప్రజలు తనని కాదని రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం తప్పని అందుకు ఫలితం అనుభవిస్తున్నారని ఇటీవల కేసీఆర్‌ అన్నారు.

ఆయన కూతురు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “బీఆర్ఎస్‌ (కేసీఆర్‌)తీరు వెయ్యేళ్ళయినా మారదని నిరూపించుకున్నారు,” అని తండ్రిని ఎద్దేవా చేశారు.

ADVERTISEMENT

ఆమె నిన్న టీఆర్ఎస్‌ పార్టీని ప్రకటించిన తర్వాత ఈసారి తండ్రిని పేరు పెట్టి ‘ప్రజా సమస్యలపై స్పందించని మర మనిషి కేసీఆర్‌’ అంటూ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికలలో మా పార్టీ గెలిచి నేను తెలంగాణ సిఎం అవుతానన్నారు.

అదే… మరెవరైనా కేసీఆర్‌ని అన్ని మాటలు అంటే ఈపాటికి వారి ఇళ్ళ ముందు బీఆర్ఎస్‌ నేతలు ధర్నాలు చేస్తుండేవారు. కానీ ఆమె అన్న, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సహా ఏ ఒక్కరూ 24 గంటల తర్వాత కూడా స్పందించలేదు.

ఇలాంటి సమయంలో కర్ర విరగకుండా పాము చావకుండా కొట్టేందుకు సొంత మీడియా ఉంది. కనుక దానిలో ‘కేసీఆర్‌ వెంటే తెలంగాణ ప్రజలున్నారు… మిగిలిన వారందరూ డమ్మీలే” అంటూ ఓ పెద్ద ఆర్టికల్ వేసింది.

దానిలో… పార్టీ అధినేతలు రాత్రికి రాత్రి పుట్టుకురారని ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి నాయకులుగా తమ కంటూ గుర్తింపు సంపాదించుకుంటారని, అలాంటి వాళ్ళ చుట్టూనే దేశ, రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉంటాయని పేర్కొంది.

అలాంటి గొప్ప శక్తివంతులైన నాయకుల జాబితాలో కేసీఆర్‌, జగన్‌, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ బిస్వాస్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్ వంటివారున్నారని పేర్కొంది.

ఆ జాబితాలో ప్రధాని మోడీ, దివంగత ప్రధాని ఇందిరాగాంధీల పేర్లు కూడా చేర్చింది. కానీ శక్తివంతులైన ఆ నాయకుల జాబితాలో నాడు సమైక్య రాష్ట్రానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సిఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పేరు లేదు!

అలాగే తమలో తాము కీచులాడుకుంటున్న వానరసేన వంటి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలందరినీ ఏకం చేసి కేసీఆర్‌ని మట్టి కరిపించిన సిఎం రేవంత్ రెడ్డి పేరు కూడా లేదు. బీఆర్ఎస్‌ సొంత మీడియా గుర్తింపు వారిరువురికీ అవసరం లేదు కూడా.

నీచ రాజకీయాల కారణంగా అలాంటి ప్రముఖులు, వారితో పాటు రాష్ట్రాలు, ప్రజలు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోందని పేర్కొంది. కానీ ప్రజలు ఎల్లప్పుడూ శక్తివంతుడైన నాయకుడి వెంటే నడుస్తారని ముగించింది.

నాడు కేసీఆర్‌, జగన్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరించారో అందరూ చూశారు.

జగన్‌ నిరంకుశత్వం, అవినీతిపాలన గురించి ఆయన సొంత చెల్లెలు షర్మిల ఇక్కడ చెపుతుంటే, అక్కడ కేసీఆర్‌ గురించి ఆయన కూతురే రోజూ చెపుతున్నారు. కానీ మేము చేసిందే రాజకీయాలు… మేము చేసిందే పాలన అని ఇద్దరూ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు.

ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఆత్మపరిశీలన చేసుకొని తప్పులు సరిదిద్దుకొని వెంటనే ప్రజల మధ్యకు రావాలి. కానీ కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ ఇవేవీ చేయకుండా ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేస్తూ, ప్రజలు తప్పనిసరిగా తమనే ఎన్నుకోవాలని, ఎన్నుకుంటారని చెప్పుకుంటున్నారు.

ముంజేతి కంకణం చూసుకునేందుకు అద్దం అవసరం లేదు. చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతకాల్సిన అవసరం లేదు.

కానీ కేసీఆర్‌ యూపీ, బిహార్, బెంగాల్, అస్సాం, తమిళనాడులో నాయకులను చూస్తున్నారే తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ పార్టీ అధినేత ఏవిధంగా మెసులుకోవాలి? ఏవిధంగా ప్రజా సమస్యలపై పోరాడాలి? ఏవిధంగా నిత్యం ప్రజల మద్య ఉండాలని ఆచరించి చూపించిన పక్కనే ఉన్న టీడీపి అధినేత చంద్రబాబు నాయుడుని, పీసీసీ అధ్యక్షుడుగా కాంగ్రెస్‌ పార్టీకి విజయం సాధించి పెట్టిన రేవంత్ రెడ్డిని చూసి ఏమీ నేర్చుకోలేదు.

ఎందుకంటే, కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ అహంకారం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం అనే అవలక్షణాలతో బాధ పడుతున్నారు కనుక! ఆ అసూయాద్వేషాలు చివరికి తమనే దహించి వేస్తాయని అనుభవపూర్వకంగా ఇద్దరూ తెలుసుకున్నప్పటికీ, ఆ అహంభావం, అవలక్షణాల వల్లనే ఇద్దరూ గుణ పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు.

ఇటువంటి సమయంలో వారికి మార్గదర్శనం చేయాల్సిన సొంత మీడియా కూడా తాన తందానా అంటూ భజన చేస్తూ శల్యసారధ్యం చేస్తోంది.

కనుక ఇవన్నీ వారి బలాలు కావు.. బలహీనతలే! ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఆలోచనా విధానం వారి పార్టీల దౌర్భాగ్యమే, శాపమే అనుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Box Office: A Disaster Weekend @ Tollywood

The Telugu box office is usually explosive in nature when there is an interesting film…

21 minutes ago

రెడ్డి గారి మద్దతుతో బీసీ-సీఎం…అసందర్భమమైన ప్రకటనా.?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రీతిలో కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో…

30 minutes ago