రాజకీయాల్లో విజయం సాధించడమంటే సామాన్యమైన విషయం కాదు. కొన్ని లక్షల, కోట్ల ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం. ఈ విషయంలో కేసీఆర్ నూటికి నూరు పాళ్ళు విజయవంతం అయ్యారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావంతో కేసీఆర్ రాజకీయ జీవితం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మొదలైన గ్రాఫ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల వరకు తిరుగు లేకుండా సాగిపోవడం వెనుక కేసీఆర్ అనుసరించిన విధానం ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉందని చెప్పాలి.
ప్రజల అభీష్టాన్ని తెలుసుకోవడంలో కేసీఆర్ సరిగా అంచనా వేయడం వలనే ఈ స్థాయి విజయాలు సొంతం అవుతున్నాయని విశ్లేషకుల భావన. ఒకప్పుడు రెచ్చగొట్టుడు ప్రసంగాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటికి కాస్త దూరంగా జరిగారు. అప్పుడప్పుడు మాత్రమే పదునైన ప్రసంగాలతో ప్రజల ఆసక్తిని తన వైపుకు తిప్పుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ ప్రచారం ముగియడానికి ముందు రోజు భారీ బహిరంగ సభలో కేసీఆర్ రెచ్చిపోయిన తీరు బహుశా చాలా మందిని ప్రభావితం చేసినట్లు కనపడుతోంది. చంద్రబాబే లక్ష్యంగా సాగిన కేసీఆర్ ప్రసంగం ఫలితం ఏమిటో ఓట్ల లెక్కింపు తర్వాత అందరికీ తెలిసి వచ్చింది. అంతలా రెచ్చిపోయిన కేసీఆర్ కు భారీ విజయం దక్కడంతో ప్రెస్ మీట్ లో ఇంకెంతగా ప్రతిపక్షాలను చీల్చిచెండాడుతారోనని అంతా భావించారు.
కానీ వాటికి భిన్నంగా చాలా ముభావంతో అందరినీ కలుపుకోయే రీతిలో కేసీఆర్ ఇచ్చిన ప్రసంగం విమర్శకులను ఆకట్టుకుంది. అంతేగాక, గర్వం, అహంకారం వద్దంటూ తన పార్టీ నేతలకు పిలుపివ్వడం మరింత విస్తుపోయే అంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో దూకుడైన తీరుతో రెచ్చిపోయిన కేసీఆర్ యేనా ఇంత సౌమ్యంగా మాట్లాడుతోంది అన్న రీతిలో ప్రసంగించారు. నెగ్గాలంటే… ఎక్కడ తగ్గాలో,
ఎక్కడ ఏక్కాలో… కేసీఆర్ కు తెలిసినంతగా వర్తమాన రాజకీయ నాయకులలో మరొకరికి తెలియదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాటలు.





