
మార్చి 9 తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగబోతున్నందున అధికారంలో ఉన్న వైసీపికి పెద్ద అగ్నిపరీక్షే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలివిగా నాలుగు నెలల ముందు 2018 డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలకు వెళ్ళడంతో, తెలంగాణలో అన్ని పార్టీలపై ఒత్తిడి తగ్గింది.
పైగా శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన వారు వెంటనే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు మళ్ళీ అవకాశం లభిస్తోంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి ప్రతిపక్షాల కంటే చాలా ‘అడ్వాంటేజ్’ ఉంటుంది కనుక ఆనాడు కేసీఆర్ ముందస్తు నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి రాబోతోంది.
కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి ముఖ్యమంత్రి కుర్చీకి దూరమైన కేసీఆర్‌కి త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలు తన సత్తా నిరూపించుకునేందుకు ఓ గొప్పఅవకాశమే. కానీ ఈ ఎన్నికలే ఆయనకు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి.
బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ 9 సిట్టింగ్ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేసీఆర్ ఒడ్డున పడతారు. కానీ వాటిలో కొన్ని కాంగ్రెస్ పార్టీకి కోల్పోతే మాత్రం పార్టీ నేతలకు ఆయన నాయకత్వంపై నమ్మకం పోతుంది. అదే బిఆర్ఎస్ పార్టీ పతనానికి దారి తీయవచ్చు.
కేసీఆర్, కేంద్రంతో చేతులు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తే తప్ప మరో 5 ఏళ్ళ వరకు తెలంగాణలో ఎన్నికలు జరుగవు. కనుక త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలే కేసీఆర్‌కి చివరి అవకాశం, పెద్ద అగ్ని పరీక్ష అని భావించవచ్చు.
కానీ ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలలో కనీసం 12 గెలుచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో చాలా దారుణమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే ఆయన కేసీఆర్‌ని ఓడించి గద్దె దించగలిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరోసారి బిఆర్ఎస్ పార్టీని ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. తాజా సర్వే కూడా అదే చెపుతోంది.
పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సంస్థలు కలిసి చేసిన సర్వేలో కాంగ్రెస్: 8-10, బిఆర్ఎస్: 3-5, బీజేపీ: 2-4 సీట్లు, ఇతరులు: ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 40, బిఆర్ఎస్ పార్టీకి 31, బీజేపీకి 23, ఇతరులకు 6 శాతం ఓట్లు లభించవచ్చని నివేదికలో పేర్కొన్నాయి.
ఈ తాజా సర్వే ప్రకారం చూస్తే, కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీలకు గడ్డు రోజులు ముందున్నట్లు కనబడుతోంది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…