
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి కేసీఆర్‌కు పెద్ద షాక్. దాని నుంచి తేరుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదోవిదంగా ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా బెడిసికొడుతున్నాయి. శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ మంత్రులను ఎదుర్కొలేక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తడబడుతున్నారు. ఈ పరిస్థితి చూసి బిఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి దూకేస్తున్నారు.
ఒక్క ఓటమితో కేసీఆర్, బిఆర్ఎస్ పరిస్థితి ఇంత దయనీయంగా మారిందని ఆలోచిస్తే, అధికారంలో ఉన్నప్పుడూ మా అంత పోటుగాళ్ళు లేరని, మేము తప్ప తెలంగాణకు మరో దిక్కు లేదనే అహంభావంతో మిడిసిపడటం, అతిగా గొప్పలు చెప్పుకోవడమే అని చెప్పవచ్చు. అందుకే ఒక ఓటమి, చిన్న సమస్య కూడా భూతద్దంలో నుంచి చూసిన్నట్లు చాలా పెద్దదిగా కనబడుతోంది.
బిఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులకు తన నాయకత్వంపై నమ్మకం కోల్పోతే పార్టీ విచ్ఛిన్నమైపోతుందని కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే నల్గొండలో సభ పెట్టి సింహంలా గర్జించే ప్రయత్నం చేశారు. కానీ చేతి కర్ర సాయం లేనిదే లేచి నడవలేకపోతున్న కేసీఆర్ సింహం ఏమిటి? గర్జించడం ఏమిటని సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఎద్దేవా చేశారు. అది వేరే విషయం.
బిఆర్ఎస్ పరిస్థితి ఈవిదంగా ఉంది కనుకనే నలుగురు ఎమ్మెల్యేలు సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి వచ్చినా కేసీఆర్ వారిని ఏమీ అనలేదు. ఇటీవల హరీష్ రావు నోరుజారి రేవంత్ రెడ్డి తప్పుకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉన్నానని మనసులో చిరకాల కోరికని బయటపెట్టేసుకున్నారు.
ఆయన ‘తూచ్…’ అని సవరణ ప్రకటన చేయకపోయినా కేసీఆర్ అసలు ఆ విషయం తెలియన్నట్లు మౌనంగా ఉండిపోయారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ చాలా మృదువుగా కేసీఆర్ విధానాలను ప్రశ్నిస్తూ మాట్లాడినందుకు మరో ఆలోచన చేయకుండా మెడ పట్టుకొని బయటకు గెంటేశారు. కానీ ఇప్పుడు హరీష్ రావు (కేసీఆర్, కేటీఆర్ బదులు) నేనే ముఖ్యమంత్రి పదవి చేపడతానని మీడియా ఎదుట చెప్పినా కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు. అదే అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఈ మాట అని ఉంటే కేసీఆర్, కేటీఆర్ సహించేవారా? అంటే కాదనే తెలుసు.
హరీష్ రావు కూడా నోరుజారి ముఖ్యమంత్రి పదవి చేపడతానని అన్నందుకు, కాంగ్రెస్ మంత్రులు, బీజేపీ నేతలు కూడా పదేపదే ఆ విషయం ప్రస్తావిస్తూ, “అయితే కటప్ప కేసీఆర్‌కు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడు? బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడతాడు?” అంటూ దెప్పిపొడుస్తుంటే హరీష్ రావు కూడా మౌనంగా భరించక తప్పడం లేదు. పాపం మామా అల్లుళ్ళ పరిస్థితి ఇలా తయారైందేమిటో?
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…