
బిఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు. వాటిలో కేసీఆర్ అహంభావం కూడా ఒకటి. తన అహంభావం వలన పార్టీ అధికారం కోల్పోయిందని, పార్టీ ఖాళీ అయిపోతోందని, లోక్‌సభ ఎన్నికలలో కూడా ఓడిపోబోతోందని గ్రహించినా కేసీఆర్ తీరు నేటికీ మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మంగళవారం సంగారెడ్డి ఎన్నికల ప్రచారసభలో ఆయన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి, “ఈ లిల్లీపుట్ ప్రభుత్వం ఏడాది కూడా అధికారంలో ఉండదు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ చేసేసినా ఆశ్చర్యం లేదు. నేను 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టిస్తే, నిన్న ఆయన జయంతి రోజున ఈ లిల్లీపుట్ మంత్రులు ఎవరూ అక్కడకు వెళ్ళి ఓ పువ్వు పెట్టలేకపోయారు. కానీ సిగ్గూశరం లేకుండా ఆయన పేరుతో నేను కట్టించిన సచివాలయంలో కూర్చొంటున్నారు.
మీరు (ప్రజలు) పాలిచ్చే ఆవుని కాదని దున్నపోతును తెచ్చుకున్నారు. కనీసం ఇప్పటికైనా మేల్కొని లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోండి. బిఆర్ఎస్ పార్టీ గెలవకపోతే మాకేమీ నష్టం లేదు. మీరే నష్టపోతారు,” అంటూ కేసీఆర్ ఇంకా చాలా మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజు నుంచే ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ కేసీఆర్, కేటీఆర్ శపిస్తూనే ఉన్నారు. వారి చేత తానే ఆవిదంగా మాట్లాడించానని కేసీఆర్ మాటలతోనే నిన్న బయటపెట్టుకున్నారు.
తన ప్రభుత్వం జోలికి వస్తే తెలంగాణకు ప్రమాదం జరిగిపోతోందన్నట్లు హడావుడి చేసిన కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం తప్పుగా భావించడం లేదు!
ఎందుకంటే తాను పోరాడి సాధించుకున్న తన సొంత సామ్రాజ్యం తెలంగాణ… దానికి తానే రాజునని, దానిపై సర్వ హక్కులు, శాస్విత హక్కులు తనకు, తన వారసులకు, తన పార్టీకి మాత్రమే ఉంటాయని కేసీఆర్ భావిస్తుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ రాజరికపు ఆలోచనల కారణంగానే కేసీఆర్ నోటి దురుసు, నిరంకుశ పోకడలు కూడా ప్రదర్శిస్తుంటారనుకోవచ్చు.
అందుకే ముఖ్యమంత్రిని లిల్లీపుట్ అని, ప్రభుత్వం నడపడం చాతకాదని, బీజేపీలోకి జంప్ అయిపోతారంటూ చాలా చులకనగా మాట్లాడారనుకోవచ్చు.
అయితే ఆ లిల్లీపుట్ రేవంత్ రెడ్డే అపర చాణక్యుడినని మిడిసిపడే తనను ఓడించి మూల కూర్చోపెట్టాడని, తెలంగాణ రాజకీయలలో తన తలదన్నేవాడు మరొకడు పుట్టాడని కేసీఆర్ ఇంకా గ్రహించిన్నట్లు లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ కేసీఆర్ పదేపదే మాట్లాడుతున్నందునే రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యి బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తున్నారు. కానీ ఇంత చిన్న విషయం కూడా గమనించకుండా ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు.
కనుక బిఆర్ఎస్ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుపోకుండా ఉండరు. అంటే మొన్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి, రేపు బిఆర్ఎస్ పతనానికి కూడా కేసీఆర్ అహంభావం, నోటి దురుసే కారణం కాబోతున్నాయన్న మాట!
The Bigg Boss journey of Agni Pareeksha contestant Apoorva has come to a close. By…
A film can have a weak trailer, little audience interest and still look like a…