టీఆర్ఎస్ ప్రభుత్వ సత్తాకు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పై అచంచల విశ్వాసాన్ని ఉంచుతూ హైదరాబాద్ నగర ప్రజలు ముక్తకంఠంతో తీర్పును ఇచ్చారు. కారు దూసుకెళ్లిన స్పీడుకు ప్రత్యర్థి వర్గాలు నామరూపాలు లేకుండా పోయాయి. విశేషమేమిటంటే… ఈ స్థాయిలో ప్రజలు తీర్పు ఇస్తారని బహుశా సిఎం కేసీఆర్ కూడా అంచనా వేసి ఉండరేమో! ఆందుకే ఎంఐఎంతో కలిసైనా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని అన్నారు. తాజాగా వెలువడిన తీర్పుతో ఎంఐఎం అవసరం కూడా లేకుండా పోయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా జీహెచ్ఎంసీ బాధ్యతలను నెత్తికెత్తుకున్న కేటీఆర్ అంచనాలను మించిన విజయాన్ని అందుకున్నారు. సవాళ్ళు – ప్రతిసవాళ్ళతో ఎప్పుడూ ఏదొక వార్తలతో సందడి చేసిన కేటీఆర్ కు హైదరాబాద్ ప్రజలు మరిచిపోలేని అనుభూతులను కానుకగా మిగుల్చారు. ముఖ్యంగా సెటిలర్ల విషయంలో కాస్త ఆందోళనకు గురైన టీఆర్ఎస్ వర్గాలకు షాకిచ్చే విధంగా సెటిలర్ల ఓట్లు పడ్డాయి.
సెటిలర్లు అత్యధికంగా ఉండే హైదర్ గూడ వంటి ప్రాంతాలలో సైతం ‘గులాభీ’ జెండా రెపరెపలాడింది. అలాగే కూకట్ పల్లి వంటి ఏరియాల్లో కూడా కారు స్పీడు సాధారణ స్థాయిలో లేదు. ఒక్క హౌసింగ్ బోర్డు కాలనీ మినహా అన్ని ప్రాంతాలలోనూ కేసీఆర్ వర్గానికే ప్రజలు పట్టం కట్టారు. హైదరాబాద్ లో తమ ప్రభావం చాటాలని కలలు కన్న కేసీఆర్ కల ఘనమైన రీతిలో ముగిసింది.
ఇక నుండి “ఉమ్మడి రాజధాని” కేసీఆర్ సొంతం… హైదరాబాద్ కింగ్ కేసీఆర్ మాత్రమే… అన్న ఆనందదాయకమైన మాటలు ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్గాల నుండి రావడం సహజమే కదా!





