ఖైరతాబాద్‌లో కవిత ఎవరిని గెలిపిస్తారు? ఓడిస్తారు?

Kavitha enters Khairatabad bypoll contest

దానం నాగేందర్‌ ఎమ్మెల్యే సీటు ఖాళీ అవడంతో ఆరు నెలల్లోగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక నుంచి ప్రతీ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ పోటీ చేసి గెలుస్తూ, కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని, అందరూ కేసీఆర్‌ కోసం ఎదురుచూస్తున్నారని నిరూపిద్దామని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శనివారమే చెప్పారు.

ఖైరతాబాద్ సీటుని దక్కించుకోవడానికి ఈసారి బీఆర్ఎస్‌ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడబోతోందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం ఇంతకాలం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా దాని క్షేత్రపాలకుడుగా దానం నాగేందర్‌ ఉండేవారు. కనుక ఆ కోటని కాపాడుకునేందుకు ఆయనతో సహా సిఎం రేవంత్‌ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తారు. కనుక ఇక్కడ కూడా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని స్పష్టమవుతోంది.

తెలంగాణలో బిజేపి గాలి మొదలైందని నిరూపించేందుకు ఇదొక గొప్ప అవకాశంగా బిజేపి చూస్తోంది. కనుక అదీ కాస్త గట్టిగానే ప్రయత్నించవచ్చు.

కనుక ఇంతవరకు ఈ మూడు పార్టీల అభ్యర్ధులు ఎవరు? మూడు పార్టీలు ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తాయనే చర్చే జరుగుతోంది.

కానీ ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ పార్టీ కూడా పోటీ చేస్తుందని కల్వకుంట్ల కవిత శనివారమే ప్రకటించారు.

ఆమె స్వయంగా పోటీ చేసి గెలిస్తే తెలంగాణ ప్రజలకు, రాజకీయ వర్గాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్‌ పార్టీ నుంచి ఆమె పార్టీలోకి రావాలని ఎదురుచూస్తున్నవారికీ బలమైన సంకేతం పంపించినట్లవుతుంది.

కానీ ఓడిపోతే అది పార్టీకి అపశకునంగా మారుతుంది. ఆమె శక్తియుక్తులు, సామర్ధ్యంపై అనుమానాలు మొదలయితే టీఆర్ఎస్‌ పార్టీ రాజకీయంగా చాలా నష్టపోతుంది. కనుక బలమైన అభ్యర్ధిని ఎంపిక చేసుకొని బరిలో దించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ టీఆర్ఎస్‌ పార్టీ గెలుపోటముల కంటే, ఈ ఉప ఎన్నికలో ఆమె ఎంట్రీతో కాంగ్రెస్‌, బిజేపి ముఖ్యంగా బీఆర్ఎస్‌ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేదే కీలకం.

ఖైరతాబాద్‌లో అన్ని వర్గాలకు చెందిన ఓటర్లు ఉంటారు. వారిని ఆకట్టుకొని మెప్పించడం చాలా కష్టం. పైగా మంది ఎక్కువయితే మజ్జిగ పలుచబడినట్లు, టీఆర్ఎస్‌ ఎంట్రీతో ఓట్లు మరింతగా చీలిపోతాయి.

అక్కడి ఓటర్లు చాలా కాలంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దానం నాగేందర్‌ని గెలిపిస్తున్నారు. కనుక ఆమె ఎంట్రీతో కాంగ్రెస్‌ ఓట్లు చీలే అవకాశం ఉంది.

ఒకవేళ ఆమె కాంగ్రెస్‌ ఓట్లు చీల్చగలిగితే బీఆర్ఎస్‌ పార్టీ లబ్ది పొందుతుంది. అదే.. ఆమె బీఆర్ఎస్‌ పార్టీని టార్గెట్ చేసుకుని గట్టిగా పోరాడితే, కాంగ్రెస్‌ పార్టీ లబ్ది పొందుతుంది.

కనుక ఆమె వలన ఏ పార్టీకి లాభం, నష్టం జరుగుతుందనేదే కీలకం తప్ప టీఆర్ఎస్‌ పార్టీ గెలుస్తుందా లేదా?అని కాదు. కనుక వచ్చే శాసనసభ ఎన్నికలకు ఈ మూడు పార్టీలకు ఇదొక ట్రయల్ రన్ వంటిదని చెప్పవచ్చు

ADVERTISEMENT
Latest Stories