గుడివాడలో చంద్రబాబు, లోకేష్, ఎన్నారై ఎవరైనా సరే… తగ్గేదేలే: కొడాలి

Kodali-Nani-Challenges Chandrababu-Naidu-సిఎం జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా రాబోయే ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో టిడిపి ముఖ్యనేతలను ఓడించి దెబ్బతీయాలనుకొంటున్నారో, అదేవిదంగా టిడిపి కూడా వైసీపీ ముఖ్యనేతలను వారి నియోజకవర్గాలలోనే ఓడించేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా నిత్యం చంద్రబాబు నాయుడిని ఉద్దేశ్యించి చాలా అనుచితంగా మాట్లాడుతున్న గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించేందుకు పావులు కదుపుతోంది. అయితే గుడివాడ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని చెలరేగిపోతున్న కొడాలి నానిని ఢీ కొని ఓడించగల మొనగాడి కోసం టిడిపి వెతుకుతోంది. గుడివాడలోని కులసమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని వెనిగళ్ళ రాము అనే ఎన్నారై పేరుని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గుడివాడలో ఆయన కుటుంబ సభ్యులు చాలాకాలంగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నందున వారికి ప్రజలలో మంచి పేరే ఉంది. కనుక వెనిగళ్ళ రాముని గుడివాడ బరిలో దింపాలని టిడిపి నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన విదేశాల నుంచి గుడివాడ తిరిగివచ్చేసి ‘పని మొదలుపెడతారని’ టిడిపి నేతలు చెప్పుకొంటున్నారు.

దీనిపై కొడాలి నాని స్పందిస్తూ, “గుడివాడ ప్రజలంటే టిడిపికి ఇంత లోకువా? విదేశాల నుంచి ఓ వందో రెండొందల కోట్లు పట్టుకొని గుడివాడలో కులసంఘాలకు, ప్రజలకు పంచేస్తే అందరూ గుడ్డిగా ఆయనకే ఓట్లు వేసేస్తారనుకోవడం అవివేకం. గుడివాడ ఎమ్మెల్యేగా ఎవరుండాలో నిర్ణయించేది ఇక్కడి ప్రజలే కానీ డబ్బు కట్టలు, రాజకీయ విశ్లేషకులు కారు. కనుక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, లేదా ఎన్నారై ఎవరు పోటీ చేసినా నేను రెడీ! గుడివాడలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేసేది గెలిచేది నేనే,” అని సవాల్ విసిరారు. గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదని అందరికీ తెలుసు. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదని కూడా గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories