కష్టాలు మనుషులకే వస్తాయి. ఆ కష్టాలు వచ్చినపుడు మనిషి ప్రవర్తించే తీరే వారి క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం కొడాలి నానికి కూడా “పెట్రోల్ బంక్” అంత కష్టం వచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలకు కొడాలి కట్టుబడి ఉంటారా? అంటూ ప్రతిపక్ష పార్టీలు టిడిపి, జనసేనలు ఎదురుదాడి చేస్తుంటే, వారిని నిలువరించలేక మీడియా ముందు యధావిధిగా చంద్రబాబుపై తన అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తూ కాలం గడిపేస్తున్నారు.
గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్ లో కేసినో జరిగినట్లుగా ఆధారాలున్నాయి, ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా, టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా… అంటూ టీడీపీ నేత బొండా ఉమా సవాల్ విసిరి మరీ పెట్రోల్ డబ్బా తానే తెస్తాను రెడీ అన్నారు. జనసేన తిరుపతి నేతలైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రెస్ మీట్ కే పెట్రోల్ డబ్బా తీసుకువచ్చి కొడాలి నాని ఛాలెంజ్ కు రెడీ అని సవాళ్ళను విసురుతున్నారు.
ఇలా మూకుమ్మడిగా తన మీద విపక్షాలు పడుతుంటే, ఓ మీడియా వ్యక్తి వెళ్లి ‘అలా కేసినో జరగనప్పుడు బాధ్యత గల ఓ క్యాబినెట్ మంత్రిగా మీరు చూపించవచ్చుగా’ అడుగగా, చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని అంటున్నాను, మనిద్దరం వెళ్దామా, వాళ్ళు రానిస్తారా?’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. అయితే మంత్రివర్యులకు వ్యక్తిగత ఇంటికి, కన్వెన్షన్ మాల్ కు తేడా తెలియదని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.
ఇంకొక్క విషయం ఏమిటంటే… నిజంగా చంద్రబాబు ఇంట్లో అలా జరిగినట్లు వీడియో లేక ఇతర ఏ ఆధారాలు ఉంటే చూపించి ఖచ్చితంగా కొడాలి నాని డిమాండ్ చేయొచ్చు. అది చంద్రబాబు ఇల్లైనా లేక ఆ మాటకొస్తే ఇంకెవరి ఇల్లైనా! గుడివాడలో కేసినో తరహా సంఘటనలు జరిగాయని కళ్ళ ముందు అనేక వీడియోలు స్పష్టంగా కనపడుతున్నాయి, వాటిని నిరూపించమని తమరే కోరారు, సవాళ్ళు విసిరారు, వాటిని ప్రతిపక్షాలు స్వీకరించాయి కూడా!
ఇప్పుడు మళ్ళీ తోకముడవడం అనేది గట్స్ ఉన్న నేతగా చెప్పుకునే కొడాలి నాని వంటి వారికి తగునా?! ఆధారాలు ఎదురుగా ఉంటే దాని గురించి మాట్లాడకుండా, పొద్దున్న లేచింది మొదలు చంద్రబాబును తిట్టడం తప్ప తనకేమి తెలియదన్నట్లుగా బూతులు మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? ప్రస్తుతం మంత్రి గారు ఎంత “ఫ్రస్ట్రేషన్”లో ఉన్నారో తెలియాలంటే ఈ ఒక్క వీడియో చాలు!అయినా సవాల్ విసరడం ఎందుకు? ఇపుడు దానికి ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక సతమతమవ్వడం ఎందులకు?
గుడివాడలో అలా జరిగిందని తెలిసి తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పినట్లుగా తానే స్వయంగా మీడియా ముందు చెప్పారు. జరిగిన మాట వాస్తవం… అయితే అది కొడాలి నాని ప్రమేయంతో జరిగిందా? లేక మంత్రి గారికి తెలియకుండా అదంతా చేసారా? అన్నది తేలాల్సిన విషయం. ఒకవేళ తనకు తెలియకుండా అంత పెద్ద స్థాయిలో గుడివాడలో ఓ ఉదంతం జరిగిందంటే, స్థానికంగా కొడాలి నాని పట్టు కోల్పోయినట్లు అవుతుంది. ఒకవేళ తన కనుసన్నల్లోనే జరిగిందని ఒప్పుకుంటే, ప్రజల దృష్టిలో దోషిగా నిలబడాల్సి ఉంటుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే కదా!



