రాజకీయ పార్టీలు అభ్యర్ధుల గుణగణాలు, ఆర్ధిక స్తోమత, ప్రజాధరణ, కులమతాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని అందరికీ తెలుసు. కానీ వైసీపిలో ఉండాలంటే మాత్రం ప్రధానంగా మూడు అర్హతలు కలిగి ఉండాలంట!
1. ప్రత్యర్ధులను బూతులు తిట్టడం, 2. ప్రత్యర్ధులపై భౌతిక దాడులు చేయడం, 3. బాంచెన్ దొర నీ కాల్మొక్తా. ఈ విషయం మరెవరో కాదు… పెనమలూరు వైసీపి ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి స్వయంగా చెప్పారు. ఈ మూడు లక్షణాలు ఉన్నవారికే వైసీపిలో చోటు ఉంటుందని లేకుంటే మనుగడ సాగించడం కష్టమని అన్నారు.
గురువారం రాత్రి విడుదల చేసిన 3వ జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో మంత్రి జోగి రమేశ్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించబడ్డారు. అంటే పార్ధసారధికి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ నిరాకరించిన్నట్లే. మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి తనను మోసం చేశారంటూ ఆరోపిస్తున్న పార్ధ సారధి, పెనమలూరు టికెట్ మంత్రి జోగి రమేశ్‌కు ఖరారు చేయడంతో మండిపడుతున్నారు.
ఆయన పెనమలూరులో మీడియాతో మాట్లాడుతూ, “నేను ప్రత్యర్ధులను బూతులు తిట్టను. దాడులు చేయను. కనుక జగన్మోహన్ రెడ్డి నన్ను అసమర్ధుడుగా లెక్కగాత్తిన్నట్లున్నారు. పార్టీలో బీసీలకు పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకుంటారు కానీ బీసీలను గౌరవించే అలవాటు లేనేలేదు.
ఈసారి గన్నవరంలో వైసీపి గెలిచే పరిస్థితి లేదు కనుక నన్ను అక్కడి నుంచి పోటీ చేయమని అడిగారు. ఎందుకంటే నేను బీసీని కనుక ఓడిపోయినా పర్వాలేదని. అంటే బీసీలకు పరువు, ప్రతిష్ట, ఆత్మగౌరవం ఉండవని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లున్నారు. కానీ నేను అక్కడ నుంచి పోటీకి నిరాకరించడంతో జగన్‌కు నచ్చలేదు. నేను ఆయనను ధిక్కరించినట్లే భావించి పక్కన పెట్టేశారు.
జగన్మోహన్ రెడ్డి అందరూ తాను చెప్పిన్నట్లే వినాలని కోరుకుంటారు తప్ప అవతలి వ్యక్తి అభిప్రాయం తెలుసుకోవాలనుకోరు. వైసీపిలో బీసీలకు ఏ పాటి గౌరవం ఉందో పార్టీలో అందరికీ తెలుసు. నేను బీసీని కనుక ‘బాంచెన్ దొర నీ కాల్మొక్తా’ అని అన్నట్లు అణిగిమణిగి పడి ఉండాలనుకుంటే ఉండలేను. నాకు ఆత్మాభిమానం ఉంది,” అని అన్నారు.
వైసీపి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ (బీసీ) కూడా సరిగ్గా ఇదే చెప్పారు. బీసీలకు గౌరవం ఇవ్వడం అంటే ఏదో ఓ పదవి ఇస్తారని, కానీ అంత మాత్రన్న ఏదో చేసేయాలని ఆరాటపడితే కుదరదని, ఆ పదవి ప్రజలకు చెప్పుకోవడానికే తప్ప మరి దేనికీ పనికిరాదని, గౌరవం లేని చోట ఉండలేకనే వైసీపిని వీడుతున్నానని చెప్పారు.
నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు విన్నారా మరి?




